విద్యార్థుల దెబ్బకు దిగొచ్చిన జగన్ సర్కార్.. ఎయిడెడ్ విలీనంపై ఆప్షన్స్
posted on Nov 13, 2021 @ 10:30AM
‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు‘ తీరునే పట్టుకు వేలాడుతోంది ఏపీ ప్రభుత్వం. ఎన్ని సార్లు తన ఇజ్జత్ పోగొట్టుకుంటున్నా పంథా మాత్రం మార్చుకోవడంలేదు. ‘మడమతిప్పని మొండిఘటం‘ కొత్త కొత్త ఫీట్లు చేస్తూనే ఉంది. ఆపై జనం నుంచి తీవ్ర ప్రతిఘటనలు వచ్చాక, కోర్టులు మొట్టికాయలు పడ్డాక తోక ముడిచే పరిస్థితి తెచ్చుకుంటూనే ఉంది.
తాజాగా.. ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం విషయంలో ఏపీ సర్కార్ వెనకడుగు వేసింది. విద్యార్థుల దెబ్బకు దిగొచ్చింది. ఎయిడెడ్ విద్యా సంస్థల విలీనం విషయంలో కొత్తగా కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ ఉన్నత విద్యాశాఖ మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ చేసింది. ఇంతకు ముందు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి విలీనానికి ఒప్పుకున్న ఎయిడెడ్ విద్యాసంస్థలు తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునే ఛాన్స్ ఇచ్చింది.
ఆయా విద్యాసంస్థలకు నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చింది. ఆ ఆప్షన్లు ఇలా ఉన్నాయి.
1) ఆస్తులు, ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వంలో విలీనానాకి సుముఖత
2) ఆస్తులు తప్ప ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేసేందుకు అంగీకరించి, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగే ఛాన్స్
3) ఎలాంటి విలీనానికీ సుముఖతగా లేకపోతే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం
4) ఇంతకు ముందు ప్రభుత్వంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఇచ్చింది.
ఎయిడెడ్ స్కూళ్ల విలీనం ఉత్తర్వులు ఇచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో పలుచోట్ల విద్యార్థులు రోడ్డెక్కారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేశారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు. పలువురు విద్యార్థులను చితకబాదారు. పోలీసు లాఠీ దెబ్బలకు కొందరి తలలు కూడా పగలడంతో విద్యార్థిలోకం భగ్గుమంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కూడా విద్యార్థుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. దొరికిన విద్యార్థిని దొరికినట్లు దారుణంగా చితక్కొట్టారు. ఇలాంటి ప్రభుత్వ, పోలీసు దమననీతితో విద్యార్థిలోకం మరింతగా భగ్గుమంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
ఏపీలోని ఎయిడెడ్ విద్యాసంస్థలు తమ ఆస్తుల్ని, సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని 2,249 ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 68.78 శాతం విద్యాసంస్థలు ప్రభుత్వంలో విలీనం అయ్యేందుకు ఒప్పుకున్నాయి. 702 ఎయిడెడ్ విద్యాసంస్థలు విలీనానికి ససేమిరా అన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,600 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమయ్యేందుకు అంగీకరించినట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.
ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం విలీనానికి అంగీకరించని ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎలాంటి ఒత్తిడీ ఉండబోడని ఉన్నత విద్యాశాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే విలీనంపై నాలుగు ఆప్షన్లను ఇస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర ఉత్తర్వులుత జారీచేయడం గమనార్హం.