ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్.. జగన్ సర్కారుకు ఝలక్..
posted on Nov 13, 2021 @ 10:08AM
తన అక్రమాలకు సహకరించారు. సీబీఐ కేసులు ఎదుర్కొన్నారు. తనతో పాటు జైలుకు కూడా వచ్చారు. తన కోసం ఇంత చేసిన ఆ ఐఏఎస్‌కు.. తాను అధికారంలోకి వచ్చాక అందల మెక్కించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మరీ.. ఏపీకి తీసుకొచ్చారు. కీలకమైన మున్సిపల్ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి కోసం సీఎం జగన్ ఇంతా చేసినా.. ఆమెను కేసుల నుంచి మాత్రం కాపాడలేకపోతున్నారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతుండటంతో.. శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా ఉచ్చు బిగుస్తోంది. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
తనపై సీబీఐ విచారణ నిలిపివేయాలంటూ శ్రీలక్ష్మి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓబుళాపురం గనుల తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలేవరకూ.. ఓఎంసీ కేసులో తనపై సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సెప్టెంబరు 21న కొట్టేసింది. ఆ తీర్పును సవాలు చేస్తూ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ ఇప్పటికే నాలుగు ఛార్జిషీట్లు దాఖలు చేసిందని, ప్రతిసారీ అదనపు ఛార్జిషీట్ల దాఖలుకు సమయం కోరుతోందని శ్రీలక్ష్మీ తరఫు న్యాయవాది వాదించారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తేలలేదని, తొమ్మిదేళ్లుగా సీబీఐ పూర్తిస్థాయిలో అభియోగాలు నమోదు చేయనందున కేసు విచారణను నిలిపివేయాలని ధర్మాసనాన్ని కోరారు.
అయితే, శ్రీలక్ష్మి విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరష్కరించింది. ఇప్పటికే విచారణ ముగింపు దశకు చేరుకుందని సీబీఐ తెలిపిందని, త్వరగా ముగించాల్సిందిగా తాము ఒత్తిడి చేయలేమని తెలిపింది. హైకోర్టు అన్ని అంశాలూ పరిశీలించి తీర్పు ఇచ్చినందున ప్రత్యేకంగా విచారణ చేయాల్సిందేమీ లేదంటూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.