‘సైబరాబాద్ మొక్క’ హర్టయింది ఇందుకే...
posted on Jun 20, 2024 @ 12:09PM
తెలుగుదేశంలో వున్నప్పుడు చంద్రబాబు కీర్తన చేసిన ‘సైబరాబాద్ మొక్క’ విడదల రజిని, ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ భజన చేశారు. ఎమ్మెల్యే పదవితోపాటు మంత్రి పదవి కూడా పొందారు. జగన్ మెప్పు పొందడం కోసం ఏ నోటితో అయితే చంద్రబాబుని కీర్తించారో.. అదే నోటితో చంద్రబాబుని అనరాని మాటలు అన్నారు. రాజకీయ ఊసరవెల్లి తనానికి నిఖార్సయిన నిదర్శనంగా తెలుగు ప్రజల దృష్టిలో నిలిచారు. ఈ సైబరాబాద్ మొక్క విడదల రజిని మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టి, ఈ ఎన్నికలలో గుంటూరు వెస్ట్ స్థానం నుంచి పోటీ చేశారు. గుంటూరు వెస్ట్ ఓటర్లు ఈమె వేస్ట్ అని డిసైడ్ చేసి ఓడించారు. అప్పట్లో జగన్‌కి అంత చెక్క భజన చేసిన రజిని ఇప్పుడు పార్టీ మారిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జగన్ పార్టీ ఇక కోలుకునే అవకాశం ఎంతమాత్రం లేదు కాబట్టి, మునిగిపోయే ఈ పడవలో ప్రయాణం చేయడం కంటే, సేఫ్‌గా తప్పించుకునే ప్లాన్‌లో విడదల రజిని వున్నారు. ఈమె పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకోవడానికి ప్రధాన కారణం రాజకీయ భవిష్యత్తును వెతుక్కోవడం కంటే, జగన్ కాంపౌండ్లో తనకు జరిగిన అవమానమే అని తెలుస్తోంది.
జగన్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత, ఎన్నికలలో ఓడిపోయిన తన పార్టీ మాజీ ఎమ్మెల్యేలను పార్టీ ఆఫీసుకి పిలిపించారు. అక్కడకి కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతోపాటు విడదల రజిని కూడా వెళ్ళారు. ఇక్కడ ఓడిపోయిన మిగతావారితోపాటు విడదల రజినికి కూడా ఘోర అవమానం జరిగింది. జగన్‌తో భేటీ సమయంలో జగన్ రాజాలాగా కుర్చీలో కూర్చుని వుంటే, ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆయన ముందు కూర్చున్నారు. విడదల రజనితోపాటు చాలామంది జగన్ ముందు చేతులు కట్టుకుని నిల్చున్నారు. అందరితోపాటు చేతులు కట్టుకుని జగన్ ముందు నిల్చున్న విడదల రజిని ఫొటో బయటకి వచ్చింది. అక్కడ తనకు జగన్ ఇచ్చిన ట్రీట్‌మెంట్ ఆమెలో ఆవేదన పెంచినట్టు తెలుస్తోంది.
జగన్ పిలిచిన వాళ్ళే మీటింగ్‌కి వస్తారు.. పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టడానికి పెద్ద హాల్, బోలెడన్ని కుర్చీలు కూడా వున్నాయి. ఎంతమంది వస్తారో జగన్‌కి తెలుసు కాబట్టి ఈ మీటింగ్ ఏదో వాటిలో పెట్టకుండా, ఒక ఇరుకు గదిలో పెట్టి, అందర్ని నిల్చోబెట్టే జగన్ మాట్లాడి పంపించేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్ళ మీద వున్న గౌరవం ఎలా వుంటుందో.. ఓడిన వాళ్ళ మీద గౌరవం ఎలా వుంటుందో జగన్ ఈ మీటింగ్‌లో చెప్పకనే చెప్పారు. అప్పటి వరకు మంత్రులుగా బిల్డప్పుగా వున్నవారు... ఒక్కసారిగా చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఎంత అవమానంగా వుంటుందో ఊహించండి.. విడుదల రజిని అలా అవమానంగా ఫీలయ్యారు.
ఊసరవెల్లిలాగా మాట మార్చినందుకు జనం విడదల రజినిని ‘సైబరాబాద్ మొక్క’ అని ఎగతాళిగా మాట్లాడతారుగానీ, ఆమె స్థాయి ఆమెకు వుంది. ఆర్థికంగా ఆమె చాలా స్ట్రాంగ్‌గా వుంది.. అలాంటి వ్యక్తి జగన్ ముందు కూర్చునే అవకాశం కూడా లేకుండా, చేతులు కట్టుకుని నిల్చోవాల్సి రావడం ఆమెను చాలా బాధించినట్టు సమావేశం. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు అన్నట్టుగా, తాను అలా చేతులు కట్టుకుని ఎలిమెంటరీ స్కూల్ పిల్లలా నిల్చున్న ఫొటోలు బయటకి రావడం కూడా ఆమెను బాగా హర్ట్ చేసినట్టు సమాచారం. వంక లేనమ్మకి డొంక దొరికినట్టు... జగన్ పార్టీ నుంచి తప్పించుకోవడానికి ఇదొక సాకులా దొరికింది. ఆమె కుటుంబం కూడా ఇంత అవమానించిన ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఇప్పుడు విడదల రజిని పార్టీ మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. అంటే, మన ‘సైబరాబాద్ మొక్క’ త్వరలో మరో పార్టీ అధ్యక్షుడికి భజన చేయడం చూసే అవకాశం తెలుగు ప్రజలకు లభించబోతోందన్నమాట!