జగన్ 12వ జైలు వార్షికోత్సవం!
posted on May 27, 2024 @ 3:57PM
పన్నెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యారు. ఔను 2012 మే 27న జగన్ ను సీబీఐ అరెస్టు చేసింది. అంటే సరిగ్గా పుష్కర కాలం కిందట అన్న మాట. ఆ విధంగా చూస్తు జగన్ కు ఇది పన్నెండవ జైలు వార్షికోత్సవం. హైదరాబాద్ లోని దిల్ కుష్ గెస్ట్ హౌస్ లోఅక్రమాస్తుల కేసులో జగన్ ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ పన్నెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అరెస్టు చేసింది.
వైసీపీ అధినేత జగన్ మత్తం 12 సీబీఐ, ఆరు ఈడీ కేసులలో ఏ1గా ఉన్నారు. ఈ కేసులన్నీ మనీల్యాండరింగ్, పీఎంఎల్ఏ ఉల్లంఘనలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇన్ని ఆర్థిక నేరాలలో ఎ1గా ఉన్న జగన్ 11 నెలల పాటు జైలులో ఉన్నారు. సరిగ్గా 2014 ఎన్నికల ముందు బెయిలు లభించింది. అయితే బెయిలు లభించినా 2014 నుంచి 2019 ఎన్నికలలో విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే వరకూ ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరై సంతకం పెట్టాలన్న షరతుపై బెయిలు మంజూరైంది.
అయితే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కోర్టుకు హాజరు కావడం మానేశారు. అంతే కాకుండా తనపై ఉన్న కేసుల విచారణ జాప్యం అయ్యేలా చేయగలిగారు. దీనికి ఆయన ఈ కేసుల్లో ఇతర నిందితుల చేత పెద్ద ఎత్తున డిశ్చార్జ్ పిటిషన్లు వేయించారు. అలాగే పదేళ్లుగా బెయిలుపైనే కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరు కాలేనంటూ హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ వైసీపీ మద్దతు ఇవ్వడం వల్ల అందుకు ప్రతిగా బీజేపీ కేసుల విషయంలో జాప్యం జరిగేలా జగన్ కు మేలు చేకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితం జూన్ 4న వెలువడ నుంది. ఇంత కాలం కేసుల వ్యవహారంలో బీజేపీ నుంచి సహాయ సహకారాలు అందాయి. అయితే ఈ ఎన్నికలలో బీజేపీ, తెలుగుదేశంలు పొత్తు పెట్టుకుని పోటీలో ఉండటంతో ముందు ముందు జగన్ కు బీజేపీ అండదండలు ఉండే అవకాశాలు పూజ్యం. ఎన్నికలలో ఫలితం జగన్ కు ప్రతికూలంగా వస్తే మాత్రం జగన్ మళ్లీ ప్రతి శుక్రవారం కోర్టులకు హాజరుకాక తప్పదని పరిశీలకులు అంటున్నారు. అదే విధంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ కొలువుదీరితే.. కోర్టుల్లో జగన్ కేసుల విచారణ జోరందుకోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఒక సారి కేసుల విచారణ వేగం పుంజుకోవడమంటూ జరిగితే జగన్ చేయగలిగేది ఏమీ ఉండదు. ఏపీలో పోలింగ్ ట్రెండ్ ను బట్టి విజయం తెలుగుదేశం కూటమిదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సర్వేలూ, సెఫాలజిస్టులూ కూడా అదే చెబుతున్నారు. అదే జరిగితే ముందు ముందు జగన్ కు ఇక్కట్లు, ఇబ్బందులు తప్పవని చెప్పడానికి సందేహం అవసరం లేదు.