తిరుగుబాటు మొదలయ్యింది! ఇప్పుడు భారతి సిమెంట్! 4 తరువాత తాడేపల్లి ప్యాలెస్!
posted on May 27, 2024 @ 4:46PM
భారతి సిమెంట్స్ ఫ్యాక్టరీపై ప్రజలు తిరుగుబాటు చేశారు. కడప జిల్లాలో యర్రగుంట్ల వద్ద ఉన్న ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్క గ్రామాల ప్రజలు ఒక్క సారిగా రోడ్లపైకి వచ్చి ఆ కంపెనీ లారీలను అడ్డుకున్నారు. భారతి సిమెంట్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ప్రజలు మండిపడుతున్నారు. కాలుష్యం కారణాలతో … పలు గ్రామాల ప్రజలు కొంత కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారతి సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చే వాహనాల కారణంగా దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ వాహనాలను ఆపివేసి వారు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని భారతీ సిమెంట్ కాలుష్యం నుంచి కాపాడాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం భారతి సిమెంట్స్‌గా చలామణిలో ఉన్న రఘురాం సిమెంట్స్.. క్విడ్ ప్రోకో ద్వారా జగన్ ఆస్థి అయింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జమానాలో మేళ్లు పొందినవాళ్లు ముడుపులు సమర్పించేసుకోగా.. విజయసాయిరెడ్డి డైరెక్టర్‌గా ఉన్న బ్యాంకు... ఇంటికే వచ్చి రుణం ఇచ్చేసింది. అప్పట్లో జగన్ చేతిలో చిల్లిగవ్వ లేకుండానే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టేశారు. భారతి సిమెంట్స్ విషయంలో సీబీఐ అభియోగాలు రుజువైతే.. నిందితులకు యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది.
అలా... భారతి సిమెంట్ పరిశ్రమను సీఎం జగన్ తన భార్య భారతి పేరు మీద ఏర్పాటు చేశారు. ఇది ఉత్పత్తి ప్రారంభించక ముందే పదిహేనేళ్ల కిందటే… 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన వికాట్ అనే కంపెనీకి రూ. రెండు వేల కోట్లకు అమ్మేశారు. అయితే విచిత్రంగా రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వికాట్.. పేర్లలోనే కనిపిస్తుంది. మొత్తం పరిశ్రమను జగన్ కుటుంబసభ్యులే నిర్వహిస్తూంటారు. ఏపీలో వైసీపీ వచ్చాక భారతి సిమెంట్స్ మాత్రమే అత్యధికంగా ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే ఈ ఫ్యాక్టరీ కనీస కాలుష్య ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికులు గతంలో పలుమార్లు ధర్నాలు నిర్వహించారు. అప్పట్లో ఫ్యాక్టరీ యాజమాన్యం ఏవేవో హామీలు ఇచ్చి సర్దుబాటు చేసింది. కానీ అమలు చేయలేదు. ఇప్పుడు ప్రజలు తెరపైకి వస్తున్నారు.
ఇప్పుడు భారతి సిమెంట్స్ పై ప్రజలు తిరుగుబాటు చేశారు. నాలుగో తేదీ తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌పై దాడి జరగవచ్చు. ఏమైనా జరగొచ్చన్న సెటైర్లు ఏపీలో వినిపిస్తున్నాయి.
- ఎం.కె. ఫజల్