గౌతు శిరీష విజయం ఖాయమేనా?
posted on May 27, 2024 @ 3:24PM
పలాసలో మంత్రి సిదిరి అప్పలరాజు ఓటమి అనివార్యమేనా, స్వయంగా వైసీపీ నేతలే ఆయన ఓటమిని కోరుకుంటున్నారా? పలాస ప్రజానీకం కూడా అహంభావి అయిన సిదిరి అపపలరాజుకు మరో అవకాశం ఇవ్వకూడదని డిసైడైపోయి ఓటు వేశారా? అన్న ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానం వస్తోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిదిరి అప్పలరాజు తీరు పూర్తిగా మారిపోయిందని జనం భావిస్తున్నారు. వైసీపీ క్యాడర్ కూడా అదే భావన వ్యక్తం చేస్తున్నారు.
పలాస నియోజకవర్గం మొదటి నుంచీ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2019 ఎన్నికలలో సిదిరి అప్పలరాజు విజయానికి జగన్ వేవ్ మాత్రమే కారణమని పరిశీలకుల విశ్లేషణ. వాస్తవానికి సిదిరి అప్పలరాజు ఎన్నికలలో పోటీ చేయడం 2019లో అదే మొదటి సారి. ఆయనకు వైద్యుడిగా ఉన్న గుర్తింపు కారణంగా పది శాతం ఓట్లు పడితే మిగిలిన ఓట్లన్నీ కూడా జగన్ హవా కారణంగానే పోలయ్యాయని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి జగన్ హవా ఎటూ లేదు. వైద్యుడిగా సిదిరి అప్పలరాజుకు గతంలో ఉన్న మంచి పేరు, గుర్తింపు కూడా మటుమాయమయ్యాయి. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత సిదిరి అప్పలరాజు వ్యవహరించిన తీరు, ప్రదర్శించిన అహంభావం కారణంగా అటు ప్రజలు, ఇటు పార్టీ క్యాడర్ కూడా ఆయనకు దూరం జరిగారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో గౌతు శిరీష్ సిదిరి అప్పలరాజుకు ప్రత్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ జగన్ గాలిలో సిదిరి సునాయాసంగా విజయం సాధించారు. అయితే ఈ సారి ఆ పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. జగన్ సర్కార్ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు.. సిదిరి అప్పలరాజు తన వ్యవహారశైలితో తెచ్చుకున్న చెడ్డ పేరు ఆయన ఓటమికి బాటలు వేశాయని అంటున్నారు.
అదే సమయంలో మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ కుమార్తె గౌతు శిరీష గత ఎన్నికలలో ఓటమి తరువాత కూడా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు చేరువయ్యారు. గత ఎన్నికల సమయంలో సిదిరి అప్పల రాజు శిరీష్ బర్తపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆలస్యంగా తేలింది. దీంతో జనం మరోసారి సిదిరికి అవకాశం ఇవ్వొద్దని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజా నిర్ణయం ఏమిటన్నది సిదిరి ప్రచారం సమయంలోనే ప్రస్ఫుటంగా కనిపించిందంటున్నారు.
అన్నిటికీ మించి గత ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లలో భారీగా చీలిక వచ్చి సిదిరి అపపలరాజు విజయానికి దోహదపడింది. అయితే గతానికి భిన్నంగా ఆసారి ఆ మూడు పార్టీలూ కూటమిగా ఏర్పడి పోటీలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకుండా పోయింది. అలాగే గౌతు శిరీష తన ప్రచారంలో మంత్రిగా అప్పలరాజు వైఫల్యాలనూ, అవినీతిని ప్రజలలో ఎండగడట్టారు. మొత్తంమీద జగన్ సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకతకు సిదిరి అప్పలరాజు వ్యవహారశైలి కూడా వైసీపీని పలాసలో ప్రజలకు దూరం చేసిం, గౌతు శిరీష్ విజయానికి మార్గం సుగమం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.