వైకాపా అభ్యర్ధులకు షాకులిస్తున్నజగన్
posted on Dec 24, 2013 @ 11:14AM
వచ్చే ఎన్నికలు తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటం వంటివి. ఈ ఎన్నికలలో గెలవలేకపోతే దాని దుష్ప్రభావం ఆ పార్టీల మీద చాలా ఉంటుంది గనుక ఎట్టి పరిస్థితులలో విజయం సాధించడం రెండు పార్టీలకు అత్యవసరం. అందువల్ల గెలుపు గుర్రాలను వెదికిపట్టుకొనేందుకు రెండు పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. తెదేపాలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ వేర్వేరుగా సర్వేలు చేయించి, రెంటిలో మంచిమార్కులు తెచ్చుకొన్న అభ్యర్దులతో ఒక లిస్టు తయారుచేస్తుండగా, వైకాపాలో జగన్మోహన్ రెడ్డి, అతని కజిన్ అనిల్ రెడ్డి ఈ ప్రక్రియ చేప్పట్టారు.
అయితే జగన్ జైల్లో ఉన్నంత కాలం పార్టీని కాపాడుకొంటూ వచ్చిన వైవీ సుబ్బారెడ్డిని ఈ ప్రక్రియకు దూరంగా అట్టేబెట్టడమే కాకుండా, ఒంగోలు నుండి లోక్ సభకు పోటీచేయాలని ఆశించిన ఆయనకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం. ఇక ఆయనకే టికెట్ ఇవ్వకపోతే ఇక ఆయన హామీ ఇచ్చిన వారికి జగన్ టికెట్స్ ఇస్తారని భావించలేము.
వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఇంతవరకు టికెట్స్ కోసం హామీలిచ్చిన వారిని కూడా కాదని, ఖర్చుకు వెనుకాడని గెలుపు గుర్రాలను ముందుకు తీసుకు వస్తున్నట్లు సమాచారం. ఇంతవరకు తామే అభ్యర్దులమని భావిస్తూ, పార్టీ సభలు, సమావేశాల ఏర్పాట్లకు, వాటికి జనాలను తరలించడానికి, పార్టీ కార్యాలయాల ఏర్పాటుకి, నిర్వహణ కోసం లక్షలు ఖర్చుపెట్టేసిన వైకాపా నేతలు జగన్ అకస్మాత్తుగా లిస్టు లోంచి తమ పేర్లను తొలగించేసి కొత్తవారికి కేటాయిస్తుండటంతో లబోదిబోమంటున్నారు.
వైకాపాకు మొదటి నుండి వెన్నుదన్నుగా నిలచిన నంద్యాల యంపీ భూమానాగిరెడ్డికి సైతం ఈ సెగ తప్పలేదు. ఇటీవల కాంగ్రెస్ నుండి వైకాపాలోకి దూకిన యస్పీ.వై. రెడ్డికి ఆయన సీటుని కేటాయించడంతో భూమా దంపతులు అలిగి పార్టీ వ్యవహారాలకు దూరంగా మసులుతున్నారు.
ఇక పీవీ ఆర్ వెంచర్స్ అధినేత పొట్లూరి వరప్రసాద్ కు విజయవాడ లోక్ సభ టికెట్ కేటాయించగా, గుంటూరు నుండి టికెట్ హామీ ఇవ్వబడిన వల్లభనేని బాలేస్వరి స్థానంలోకి జూ.యన్టీఆర్ మావగారయిన నార్నె శ్రీనివాసరావు వచ్చి జేరడంతో బాలేస్వరికి బందర్ లోక్ సభ స్థానానికి బదిలీ అయినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్ నుండి వైకాపాలోకి దూకేందుకు ఎదురు చూస్తున్నమాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరియు ఆయనతో బాటు వస్తున్నమరో ఐదుగురు శానసభ్యులకు టికెట్స్ ఇచ్చినట్లయితే వైకాపా నేతల సంగతి ఏమిటనేది ప్రశ్నార్ధకమే.
తెదేపా యం.యల్సీ. నన్నపనేని రాజకుమారి కుమార్తె డా.నన్నపనేని సుధకి గుంటూరులో వినుకొండ శాసనసభ టికెట్ ఇస్తున్నట్లు జగన్ హామీ ఈయడంతో ఆమె పార్టీ సభలు, సమావేశాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసేసారు. కానీ, ఇప్పుడు ఆమె పేరును తొలగించి తిరుమల డెయిరీ అధినేత బ్రహ్మ నాయుడుకి టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. ముందు ఆయనకు పెదకూరపాడు నుండి టికెట్ ఖరారు చేసినప్పటికీ, ఆయన గత ఎన్నికలలో కూడా ప్రజా రాజ్యం టికెట్ పై వినుకొండ నుండే పోటీ చేసి గెలిచినందున, ఈసారి కూడా వినుకొండ నుండే పోటీ చేయించితే గెలుపు తధ్యమని భావించడంతో నన్నపనేని సుధను తప్పించి ఆయనకు ఆ సీటు కేటాయించినట్లు సమాచారం.
ఇక ఏలూరు నుండి లోక్ సభకు టికెట్ ఖరారు చేయబడిన వైకాపా నేత మొవ్వ ఆనంద్ తన పరిధిలో పార్టీ తరపున శాసనసభకు పోటీ చేస్తున్న వారి ఖర్చులను కూడా భరించలేనని స్పష్టం చేయడంతో ఆ టికెట్ మాజీ ఐఏయస్ అధికారి టీ-చంద్రశేఖర్ కు కేటాయించినట్లు సమాచారం. ఇక తాజా సమాచారం ప్రకారం కర్నూలు లోక్ సభ టికెట్ కేటాయింపబడ్డ అభ్యర్ధి స్థానంలో హైదరాబాదులో మెరిడియన్ స్కూల్స్ అధినేత నీలకంటం భార్య శ్రీమతి రేణుకకు కేటాయించినట్లు సమాచారం.
అందుకే ఇల్లలకగానే పండుగ కాదని పెద్దలు అన్నారు. ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున తమ పార్టీలోకి నేతలు వలసలు వస్తున్నారని పార్టీలు ప్రకటించుకోవడం గొప్పగానే ఉండవచ్చును. కానీ, పార్టీలో నేతలను కాదని కొత్తగా వచ్చిన వారందరికీ టికెట్స్ పోతే ఏమవుతుందో ఊహించవచ్చును.