అమాద్మీని చూసి కాంగ్రెస్, బీజేపీల ఉలికిపాటు దేనికి
posted on Dec 25, 2013 9:18AM
ఆమాద్మీపార్టీ కాంగ్రెస్ మద్దతుతో డిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకి సంసిద్దత వ్యక్తం చేసినప్పటి నుండి కాంగ్రెస్, బీజేపీలు చాలా అసహనంగా, అసహజంగా ప్రవర్తిస్తున్నాయి. ఆమాద్మీపార్టీ చీపురు దెబ్బకి డీలాపడిపోయిన కాంగ్రెస్ పార్టీ, మరో నాలుగయిదు నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలోగా ఆమాద్మీని పూర్తిగా బ్రష్టు పట్టించి, మళ్ళీ డిల్లీ పీఠం దక్కించుకోవాలనే దురాలోచనతోనే తనను తీవ్రంగా విమర్శిస్తున్న ఆమాద్మీకి మద్దతు ప్రకటించింది. ఆ ప్రయత్నంలోనే అమాద్మీ ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కూడా చేయకముందే, దేశ ముదురు కాంగ్రెస్ నేతలు ఎటువంటి రాజకీయానుభవం లేని అమాద్మీపై తమ విద్యలు ప్రదర్శించసాగారు. ఒక ప్రజాస్వామ్య విప్లవానికి నాంది పలికి, సామాన్యుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా ఆవిర్భవించిన ఆమాద్మీపార్టీతో కాంగ్రెస్, బీజేపీలు చెలగాటం ఆడితే, అవి ప్రజాగ్రహానికి గురికాక తప్పదు, ప్రజల దృష్టిలో ఆ పార్టీలు ఇంకా పలుచనవడం కూడా తప్పదు. కాంగ్రెస్, బీజేపీలు అమాద్మీని కూడా తమలాగే వీలయినంత త్వరగా భ్రష్టు పట్టించి, దాని వైఫల్యాలను పునాదిగా చేసుకొని మళ్ళీ డిల్లీ పీఠం స్వంతం చేసుకోవాలని కలలు కంటున్నాయి. ఇది నీచ రాజకీయాలకు పరాకాష్టగా చెప్పుకోవచ్చును.
ఎటువంటి పాలనానుభవం లేని రాహుల్ గాంధీ సువిశాలమయిన భారతదేశానికే ప్రధానిగా అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని వాదిస్తున్నకాంగ్రెస్ నేతలు, ప్రజామోదం పొందిన ఆమాద్మీకి మాత్రం ఆ అర్హత, తెలివి తేటలులేవని, ఉండవని భావించడం విశేషం. అమాద్మీ చేసిన వాగ్దానాలను అమలుచేయడం అసంభవమని వాదిస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు మరి తమ పార్టీలు చేసిన ఎన్నికల వాగ్ధానాలలో ఎన్నిటిని అమలు చేయగలిగారు? ఎన్నిఆచరణ సాధ్యమయినవి? వాటిని అమలుచేయడంలో నిజంగా ఆ పార్టీలకు చిత్తశుద్ది ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పరు. ఎందువలన అంటే ఆకర్షణీయమయిన ఎన్నికల మ్యానిఫెస్టోలు కేవలం ఎన్నిలలో గెలవడం కోసమే ముద్రిస్తాము తప్ప వాటిని నిజంగా అమలుచేయడానికి కాదని కాంగ్రెస్, బీజేపీ నేతల నిశ్చితాభిప్రాయం.
ఎప్పుడో మూడు నాలుగు దశాబ్దాల క్రితమే ‘గరీబీ హటావ్’ (పేదరికాన్ని పారద్రోలు) అంటూ అధికారం చేజిక్కించుకొన్న కాంగ్రెస్ పార్టీ నాటి నుండి నేటి వరకు దేశాన్నిపాలిస్తున్నప్పటికీ, నేటికీ దేశంలో దరిద్రం, ఆకలి చావులు, నిరుద్యోగం, అవినీతి వంటి సమస్యలతో సామాన్య ప్రజలు సతమతమవుతూనే ఉన్నారు. అటువంటి సమస్యలను తన శక్తిమేర అరికట్టేందుకు కృషిచేస్తానని చెపుతునందుకు కాంగ్రెస్, బీజేపీలు అమాద్మీపార్టీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నాయిప్పుడు. నిజం చెప్పాలంటే అమాద్మీతను చేసిన వాగ్దానాలలో ఏ కొన్ని సమర్ధంగా అమలు చేయగలిగినా, అటువంటి ప్రజా విప్లవం దేశమంతటా మొదలయితే తమ పార్టీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నందునే అమాద్మీ నైతిక స్థయిర్యాన్ని దెబ్బ తీసేందుకు ఆ పార్టీపై దాడిచేస్తున్నాయని చెప్పవచ్చును.
అయితే అమాద్మీకి పార్టీకి అమాద్మీ(సామాన్య పౌరుడు) అండగా ఉన్నంత కాలం కొమ్ములు తిరిగిన కాంగ్రెస్, బీజేపీలు కూడా ఏమీ చేయలేవని డిల్లీ ప్రజలు నిరూపించి చూపారు. అందువల్ల మంచి ప్రజాదారణ కలిగిన అమాద్మీ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని సామాన్య ప్రజలకు మేలు చేకూర్చేవిధంగా వ్యవస్థలను పనిచేయించవచ్చని, అటువంటి వ్యవస్థలు ఏర్పాటు సాధ్యమేనని నిరూపించవలసి ఉంది.