రాజకీయ పార్టీల కనుసన్నలలో ఏపీయన్జీవోల ఎన్నికలు
posted on Dec 23, 2013 @ 10:23AM
ఉద్యోగ సంఘాలకు ఎన్నికలు జరగడం కొత్త విషయమేమీ కాకపోయినా, త్వరలో జరగనున్నసార్వత్రిక ఎన్నికలలో అన్నిరాజకీయ పార్టీలకు ఉద్యోగ సంఘాల మద్దతు చాలా అవసరం కనుక, వచ్చేనెల 5న జరగనున్న ఏపీఎన్జీవో సంఘం ఎన్నికలకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే నిన్ననామినేషన్లు వేసిన అశోక్ బాబు, బషీర్ ఇద్దరూ కూడా తమ వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవని చెప్పుకోవడమే, వాటి ప్రమేయం ఉందని అంగీకరించినట్లయింది.
అశోక్ బాబు నేతృత్వంలో దాదాపు ఐదారు లక్షలమంది ఉద్యోగులు ఏకత్రాటిపై రెండున్నర నెలలకుపైగా సమైక్యాంధ్ర కోసం ఉద్యమించి, హైదరాబాద్ లో విజయవంతంగా “సేవ్ ఆంధ్రప్రదేశ్” సభను నిర్వహించడం, ఆ తరువాత అకస్మాత్తుగా ఉద్యమం విరమించడం, టీ-బిల్లు శాసనసభకి వచ్చినప్పటికీ ముందు ప్రకటించినట్లు సమ్మె మొదలుపెట్టకపోవడం, ఒకవైపు రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగితున్నతరుణంలో ముఖ్యమంత్రి, ఆయనతో బాటే అశోక్ బాబు కూడా పూర్తిగా చల్లబడిపోవడం గమనిస్తే అశోక్ బాబు కార్యాచరణ వెనుక ముఖ్యమంత్రి ప్రమేయం ఉందనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది.అయితే, ఇంతకాలం అన్ని రాజకీయపార్టీలను దూరంపెడుతూ వచ్చిన అశోక్ బాబు, సరిగ్గా ఉద్యోగ సంఘాల ఎన్నికలకు నామినేషన్లు వేసే మూడు రోజుల ముందు అఖిలపక్షం నిర్వహించడంతో ఆయన వారిని సమైక్య ఉద్యమం కోసం మద్దతు కోరుతున్నారా లేక ఎన్నికలలో తను గెలిచేందుకే మద్దతు కోరుతున్నారా? అనే అనుమానం కలగడం సహజం.
కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఈ సమావేశంలో పాల్గొన్న శైలజానాథ్ తదితరులు, తెదేపా తరపున పయ్యావుల కేశవ్ తదితరులు ఆయన (పోరాటాని)కి మద్దతు పలకడం, అదే సమయంలో సమైక్యాంధ్ర కోసమే పోరాడుతున్నాని చెప్పుకొనే వైకాపా ఏవో కుంటిసాకులు చెప్పి ఈ సమావేశానికి హాజరు కాకపోవడం గమనిస్తే, ఏ పార్టీలు ఎవరిని సమర్దిస్తున్నాయో ఎవరిని వ్యతిరేఖిస్తున్నాయో స్పష్టమవుతుంది. కానీ, అదేసమయంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నసీపీయం మరియు లోక్ సత్తా పార్టీలు తాము ఎవరికీ మద్దతు ఈయమని స్పష్టం చేయడం చూస్తే ఈ సమావేశం అంతర్యం కూడా స్పష్టమవుతోంది.
ఇక అశోక్ బాబుకి ప్యానల్ కి వ్యతిరేఖంగా నామినేషన్లు దాఖలుచేసిన బషీర్ మీడియాతో మాట్లాడుతూ అశోక్ బాబు సమైక్యాంధ్ర ఉద్యమాన్నినడిపించడంలో ఘోరంగా విఫలమయ్యారని, తమ ప్యానల్ గెలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పడం చూస్తే ఆయన మాటలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ కి సరిపోలుతున్నట్లు స్పష్టం అవుతోంది గనుక ఆయన ప్యానల్ కి వైకాపా మద్దతు ఉందని స్పష్టం అవుతోంది.
వచ్చే ఎన్నికలలో లక్షలాది ఏపీఎన్జీవోల, వారి కుటుంబాల ఓట్లు రాల్చుకోవాలంటే, ఈ ఎన్నికలలో తమకు అనుకూలమయిన ప్యానల్ ని గెలిపించుకోవడం అన్ని రాజకీయ పార్టీలకు అత్యవసరం. అందువల్ల రాజకీయాలకు అతీతంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అశోక్ బాబు, బషీర్ చెపుతున్న మాటలు అవాస్తవమే.
అశోక్ బాబు ప్యానల్ కు కిరణ్ కాంగ్రెస్, సీమాంధ్ర తెదేపాల మద్దతు ఇస్తుంటే, బషీర్ ప్యానల్ కి వైకాపా మద్దతు ఇస్తున్నట్లు అర్ధం అవుతోంది. ఒకవేళ అశోక్ బాబు ప్యానల్ గెలిస్తే కిరణ్ కుమార్ రెడ్డి పెట్టబోయే కొత్త (కాంగ్రెస్) పార్టీకి, తేదేపాకు, అదే బషీర్ ప్యానల్ గనుక గెలిస్తే వైకాపాకు మద్దతు ఇచ్చేఅవకాశం ఉంది.