జగన్ పార్టీ కామన్ సింబల్ కు ఈసీ నో
posted on Mar 31, 2011 9:15AM
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కామన్ సింబల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పోటీ చేయనందున కామన్ సింబల్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ నిరాకరించింది. పార్టీ సింబల్ లేకుండానే వైయస్ జగన్ పులివెందుల, కడప శాసనసభ, పార్లమెంటు సీట్లకు పోటీ చేయాల్సి ఉంటుంది. పులివెందుల శాసనసభ సీటుకు పోటీ చేసే వైయస్ విజయమ్మకు, కడప పార్లమెంటు సీటుకు పోటీ చేసే వైయస్ జగన్‌కు వేర్వేరు చిహ్నాలు లభించే అవకాశాలున్నాయి. దేశంలోని మరో ఎనిమిది పార్టీలకు కూడా కామన్ సింబల్స్ ఇవ్వడానికి ఈసి నిరాకరించింది. కాగా, వైయస్ జగన్‌ను దెబ్బ తీయడానికి వైయస్ వివేకానంద రెడ్డిని కాంగ్రెసు పార్టీ ప్రయోగిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు నాయకులే అంటున్నారు. అన్న కుమారుడు అని కూడా మర్చిపోయి వైయస్ వివేకానంద రెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు అంబటి రాంబాబు అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు రాజకీయ ప్రత్యర్థిగా మారి వైయస్ వివేకానంద రెడ్డి కాంగ్రెసు వాయిస్ వినిపిస్తున్నారని ఆయన అన్నారు. పథకం ప్రకారం కాంగ్రెసు పార్టీ వైయస్ వివేకా ద్వారా వైయస్సార్‌ను దూషింపజేస్తోందని ఆయన అన్నారు. కడప, పులివెందుల ఎన్నికలు తమ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని ఆయన అన్నారు.