ఓదార్పు యాత్ర వాయిదా
posted on Mar 31, 2011 9:11AM
విజయనగరం: ‘వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విజయనగరం జిల్లాలో నిర్వహిస్తున్న ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశారు. కడప లోక్‌సభ, పులివెందుల ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 6 వరకు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించాల్సి ఉంది. అయితే బుధవారం ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. దాంతో ఓదార్పు యాత్రను ప్రస్తుతానికి వాయిదావేసి, వైఎస్సార్ జిల్లాలో ఉప ఎన్నికల వ్యవహారాలు చూడాల్సిందిగా పార్టీ నేతలు, అభిమానులు జగన్‌ను కోరారు. మొదట ఈ యాత్రను పూర్తి చేయడానికే జగన్ నిర్ణయించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై యువనేత ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రను పార్టీ నేతలు జగన్ వద్ద ప్రధానంగా ప్రస్తావించారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలు, తాజాగా ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో రెండు పార్టీల కుట్ర, కుతంత్రాలు బహిర్గతమైన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. వెంటనే ఉప ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆయనకు సూచించారు. ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి, మళ్లీ ఇక్కడ ఓదార్పు యాత్రను కొనసాగించాలని విజయనగరం జిల్లా నేతలు కూడా ఆయనను కోరారు. పార్టీ నేతలు పదే పదే కోరడంతో.. ఓదార్పు యాత్రను తాత్కాలికంగా వాయిదా వేయడానికి జగన్ అంగీకరించారు.