కాంగ్రెస్ గెలుపు కష్టం.. ఆస్ట్రేలియాలో కోమటిరెడ్ది వెంకటరెడ్డి
posted on Oct 22, 2022 @ 1:30PM
పార్టీని అంటిపెట్టుకుని ఉండి పార్టీ విజయాన్ని, అధికారంలోకి తీసుకురావాలన్న తపన ఉన్నవారే నిజమైన పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానులు. కానీ పార్టీలో ఉంటూనే పార్టీ ప్రగతిని, ప్రతిష్టను దెబ్బతీయడం లక్ష్యంగా పెట్టుకుని రహస్యంగానో, బహిర్గతంగానో నోటికి వచ్చినట్టు కామెంట్లతో విపక్షా లకు ఉప్పు అందించేవారు పార్టీ లో ఉన్నా విరోధుల కిందనే జమ. ఇలాంటివారినే కోవర్టులంటారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే అవకాశం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అదీ ఆస్ట్రేలియాలో ఎన్ ఆర్ ఐలతో చిట్ చాట్ చేస్తూ అనడం ఇపుడు వైరల్ గా మారింది.
మునుగోడు ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్‌కు కోవర్టుల బెడద ఎదురయింది. అదీ మరీ ఊహించని విధంగా కోమటిరెడ్డి సోదరులే ఆ తలభారానికి కారణం కావడం చర్చనీయాంశమయింది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజవర్గం మునుగోడుకు కాంగ్రెస్ ఏమీ చేయడంలేదన్న ఆగ్రహం తోనే పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారు. దీంతో మునుగోడు ఉప ఎన్నిక ప్రాధాన్యత సంత రించుకుంది. బీజేపీ తెలంగాణాలో తన సత్తా ప్రదర్శించి కేసీఆర్ కు గట్టి షాక్ ఇవ్వడానికి మునుగోడు ఉప ఎన్నిక ను ఉపయోగించుకోవాలని పెద్ద వ్యూహంలో ఉంది. అందుకు రాజగోపాల్ రెడ్డి ఎంతో ఉప యోగపడతాడని నమ్మింది. అయితే ఆయన వల్ల అంతగా ప్రయోజనం లేకపోవచ్చన్నది అనతి కాలం లోనే ఢిల్లీలో బీజేపీ సీనియర్లకీ అర్ధమయింది. కానీ పోటీకి దిగిన తర్వాత ఇది తప్పని సరి గనుక టీఆర్ ఎస్‌ను దెబ్బతీయడానికి ఈ పరిస్థితులను వాడుకోవాలనే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌కు మంచి అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు ప్రచారాన్ని ఉదృతం చేశారు. కానీ కోమటి రెడ్డి బ్రదర్స్ ఇద్దరూ వేరు పార్టీలయినా అన్నదమ్ములే గనుక ఒకే ఆలోచన చేస్తారన్నది కాంగ్రెస వర్గాలు అంతగా భావించలేదు. కానీ అదే బయటపడింది.
తాను వెళ్లి ప్రచారం చేస్తే పది వేలు పెరుగుతాయి కానీ కాంగ్రెస్ పార్టీ గెలవదని ఆ వీడియోలో కోమటిరెడ్డి తెలిపారు. రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నోళ్లకు.. డబ్బులు ఇవ్వలేమన్నారు. అసలు తమ ఆర్గ నైజేషన్ అలాంటిది కాదన్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని.. తెలంగాణ కోసం కొట్లాడా నని చెప్పు కొచ్చారు. రిటైర్అయ్యో టైంలో ఏముందన్నారు. పాదయాత్ర చేసి చెబుతానంటే కాంగ్రెస్‌లో ఒక గ్రూపా? అని ప్రశ్నించారు.
సరిగ్గా మునుగోడు ఎన్నికల సమయానికి తిరిగి వస్తానని కోమటి రెడ్డి ఆస్ట్రేలియాకు చెక్కేశారు. వెళ్లే ముందుకూడా ఆయన మనసులో మాట అనేసే వెళ్లారు. మునుగోడు లో కాంగ్రెస్ గెలుపు అనుమానమే అని అన్నారు. పైగా మునుగోడు ప్రజలకు తన సోదరుడినే గెలిపించాలని సూచన చేసి మరీ విమానం ఎక్కారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహించారు. సోదరులిద్దరూ నమ్మదగినవారు కాదని అన్నారు. కోమటిరెడ్డి బ్రడర్స్ కోవర్టు బ్రదర్స్ అంటూ విరుచుకుపడుతున్నారు. కానీ ప్రయోజనమేముంది. వెంకటరెడ్డి వంటి స్టార్ కాంపెనర్ స్వయంగా పార్టీ పరాభవాన్ని ఆశించి అదే ప్రవచనంగా మార్చి మునుగోడు ప్రజలకు తెలిసేలా, వినిపించేలా చెప్పి మరీ వెళ్లారు. ఇపుడు సోదరులిద్దరినీ తిట్టుకోవడం వదిలేసి అభ్యర్ధిని గెలిపించుకోవడంలో రేవంత్ రెడ్డి తదితరులు కాలంతో పరిగెట్టాలి.