రాంకీ, హెటిరో.. జగన్ బెస్టీలపై ఐటీ రైడ్స్.. సంగతేంటి?
posted on Oct 7, 2021 @ 3:40PM
రెండు రోజులుగా హెటిరో ఫార్మాపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. కొవిడ్ 19 సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలను అధికారులు పరిశీలించారు. హెటిరో డైరెక్టర్లు, భాగస్వాముల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఇవి రోటీన్ తనిఖీలేనా? లేక....?
బండి పార్థసారధిరెడ్డి అంటే చాలామందికి తెలీకపోవచ్చు కానీ హెటిరో పార్థసారధిరెడ్డి అంటే అందరికీ సుపరిచితమే. రిట్రా వైరల్ డ్రగ్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామి సంస్థ హెటిరో. ఆ హెటిరో ఫార్మా అధినేత పార్థసారధిరెడ్డి.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడు కూడా. వైఎస్సార్ హయాంలో.. విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లో.. జగన్-హెటిరో మధ్య క్విడ్‌ప్రోకో నడిచిందని ఆరోపణలు ఉన్నాయి. తెలుగుస్టేట్స్‌లో రెండో అత్యంత సంపన్నుడు, దేశంలోకే 58వ స్థానంలో ఉన్న ధనిక పారిశ్రామికవేత్త అయిన పార్థసారథిరెడ్డికి చెందిన హెటిరో కంపెనీపై ఐటీ రైడ్స్‌ను మామూలు విషయంగా చూడలేమంటున్నారు. ఇటీవలే విశాఖ పరిధిలోని హెటిరో ప్లాంట్‌కు 83 ఎకరాలను క్రమబద్ధీకరించింది జగన్ సర్కారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగానూ ఉన్నారు హెటిరో పార్థసారధిరెడ్డి. ఆ విధంగా కేసులున్నా.. ఇప్పటికీ జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెదులుతున్నారు ఈయన.
ఈమధ్యనే జగన్‌కు మరో సన్నిహితుడైన పారిశ్రామికవేత్త, వైసీపీ ఎంపీ కూడా అయిన ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ గ్రూప్ ఆప్ కంపెనీస్‌పైనా ఐటీ దాడులు జరిగాయి. ఇప్పుడు హెటిరోఉ పార్థసారధిరెడ్డి సంస్థలపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇదంతా కాకతాళీయమా? లేక, కేంద్రం తరఫున ఏదో వ్యూహాత్మక దాడులా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్‌కు కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు ఎంతగా ఉన్నా.. అవినీతి, అక్రమాలను మాత్రం బీజేపీ సర్కారు అసలేమాత్రం ఉపేక్షించదనే పేరుంది. ఆ అరాచకాలు పెరిగిపోవడం వల్లే.. ఆ తోకలు కట్ చేయడానికేనా ఈ ఐటీ రైడ్స్ అనే అనుమానం వస్తోంది.
ఏపీలో ఇసుక మైనింగ్ కాంట్రాక్ట్ మొత్తాన్ని గంపగుత్తగా రాంకీ గ్రూపునకు కట్టబెట్టింది వైసీపీ సర్కారు. ఆ రాంకీ సంస్థనే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇసుకను టన్నులకు టన్నులు తవ్వేసుకుంటోంది. ఇక, విశాఖలో హెటిరో ప్లాంట్‌కు భారీగా భూములు అప్పగించింది జగన్ ప్రభుత్వం. ఇలా, గతంలో మాదిరే.. పారిశ్రామికవేత్తలకు జగన్‌కు మధ్య పెద్ద స్థాయిలో మళ్లీ క్విడ్‌ప్రోకో యవ్వారాలు జరుగుతున్నాయా? ఆ మేరకు కేంద్రం సమాచారం సేకరించిందా? అలాంటి చర్యలకు చెక్ పెట్టేందుకే.. ఇలా ఐటీ రైడ్స్‌తో వార్నింగ్ ఇస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. కారణం ఏదైనా.. హెటిరో సంస్థలపై ఐటీ సోదాలతో ఏపీ పారిశ్రామిక వర్గాల్లో అలజడి మొదలైందనే చెప్పాలి.