టీఆర్ఎస్ తో పొత్తుకు కాంగ్రెస్ సీనియర్ల స్కెచ్! రేవంత్ రెడ్డి దారెటు?
posted on Dec 21, 2021 @ 6:35PM
తెలంగాణ కాంగ్రెస్ లో సంచలనాలు జరగబోతున్నాయా? రేవంత్ రెడ్డికి పొగ బెడుతున్నారా? టీపీసీసీలో ఆంధ్ర నేతలు చక్రం తిప్పుతున్నారా ? అంటే గాంధీభవన్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత పార్టీ గాడిలో పడిందని అంతా అనుకున్నారు. వరుస కార్యక్రమాలతో రేవంత్ దూకుడు పెంచడంతో కేడర్ లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని భావిస్తున్న సమయంలో కొత్త కుట్రలు బయటికి వచ్చాయని అంటున్నారు. కేసీఆర్ కు కోవర్డులుగా ఉంటున్న కొందరు కాంగ్రెస్ నేతలు.. రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెద్ద ఎత్తున మంత్రాంగం జరుపుతున్నారని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి జోరు కాంగ్రెస్ పార్టీలో మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. దారిలోకి వచ్చారనుకున్న సీనియర్లు రోజుకొకరు నేరుగా రేవంత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబుకు కోవర్ట్ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. హుజూరాబాద్‌లో డిపాజిట్ కోల్పోయిన తర్వాత ఈ దాడి మరింత తీవ్రమైంది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, వీహెచ్, ఉత్తమ్, దామోదర, మధు యాష్కీ, భట్టి.. ఇలా సీనియర్ నేతలందరూ రేవంత్‌తో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. డీసీసీలను మారుస్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లాస్థాయి నేతలు కూడా అసమ్మతి స్వరమే అందుకున్నారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తున్నదే తప్ప రంగంలోకి దిగడం లేదు. దీంతో కేంద్రంలో, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఒంటరిగానే మిగిలిపోయారని అంటున్నారు. కేసీ వేణుగోపాల్, కొప్పుల రాజు వంటి ఢిల్లీ నేతలు కూడా రేవంత్ వ్యతిరేకులకు ఊతమిస్తున్నారని సమాచారం.
ఇటీవలే హైదరాబాద్ శివార్లలోని ఓ ఫాంహౌజ్‌లో నిర్వహించిన రహస్య సమావేశంలో వైఎస్సార్ ఆత్మగా పేరుబడిన ఓ నేత.. రేవంత్ వ్యతిరేక వర్గీయులను ఏకం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బీజేపీని ఉమ్మడి శత్రువుగా భావించి కేసీఆర్‌తో సఖ్యంగా ఉండడమే ప్రస్తుత పరిస్థితుల్లో శ్రేయస్కరమని వీళ్లు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేయబోతున్నారని వినికిడి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేలా వీళ్లంతా స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు. వైఎస్సార్ ఆత్మగా చెప్పుకునే నేతకు సీఎం కేసీఆర్ తో మంచి సంబంధాలున్నాయని, గులాబీ బాస్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని సమాచారం. కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలంతా వైఎస్సార్ ఆత్మ కనుసన్నల్లోనే పని చేస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ ఎన్నిక కాక రేపింది. ఈ ఎన్నికలో రవీందర్ సింగ్ అధికార పార్టీకి సవాల్ విసిరారు. ఆయనకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయనే ప్రచారం జరిగింది. హుజురాబాద్ తరహాలోనే కరీంనగర్ లో కారుకు షాక్ తగలనుందనే సీన్ క్రియేట్ అయింది. అయితే కరీంనగర్ లో పోటీలో లేకున్నా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ నిర్వహించింది. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కాంగ్రెస్ స్థానిక సంస్థల ప్రతినిధులతో క్యాంప్ నిర్వహించారు. రవీందర్ సింగ్ కోసమే ఈ క్యాంప్ పెట్టారని అంతా భావించారు. కాని ఫలితాల తర్వాత అసలు సంగతి బయటపడింది. టీఆర్ఎస్ కు వాళ్లకున్న బలం కంటే దాదాపు వంద ఓట్లు ఎక్కువొచ్చాయి. అవన్ని కాంగ్రెస్ ఓట్లేనని, శ్రీధర్ బాబు నిర్వహించిన క్యాంపులో ఉన్నవారంతా టీఆర్ఎస్ కు ఓటేశారని తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ తో వైఎస్ ఆత్మ మిలాఖత్ లో భాగంగానే ఇదంతా జరిగిందని అంటున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ ఓట్లు రవీందర్ సింగ్ కు పడితే తమకు ఇబ్బంది అవుతుందని గ్రహించిన కేసీఆర్.. కాంగ్రెస్ లోని తన కోవర్టుల ద్వారా ఈ కథ నడిపించారని అంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే సీట్ల కేటాయింపులతో పాటు పదవుల విషయంలోనూ కొందరు కాంగ్రెస్ నేతలకు గులాబీ బాస్ హామీ ఇచ్చారనే చర్చ సాగుతోంది. ఈ విషయాలను గ్రహించడం వల్లే కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి సైలెంట్ అయ్యారని గాంధీ భవన్ వర్గాల సమాచారం. కాంగ్రెస్- టీఆర్ఎస్ పొత్తు కుదిరితే రేవంత్‌రెడ్డికి అశనిపాతమే అవుతుంది. మొదటి నుంచి కేసీఆర్ టార్గెట్ గా రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి... టీఆర్ఎస్ తో కలిసి నడవడం అసాధ్యమనే చెప్పాలి. అందుకే ఆయన కూడా తనదైన శైలిలో ముందుకు పోతున్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరితే రేవంత్ రెడ్డి తనదారి తాను చూసుకోవడం ఖాయం. అయితే మరీ ఆయన ఏం చేస్తారన్నదే ఆసక్తిగా మారింది. బీజేపీ నుంచి ఆహ్వానం ఉన్నా ఆయన కమలం గూటికి చేరకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీలో టాప్ లీడర్లు ఎక్కువయ్యారు. ఆ పార్టీలో సీఎం రేసు కూడా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా అన్న చర్చ కూడా సాగుతోంది. అయితే త్వరలోనే చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. కొండాకు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో.. కొండా పెట్టబోయే పార్టీలో రేవంత్ రెడ్డి చేరవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ తో పాటు రాజకీయంగా సంచలనాలు జరిగే అవకాశం ఉందని మాత్రం కచ్చితంగా తెలుస్తోంది.