డాక్టర్ కు ఒమిక్రాన్.. హైదరాబాద్ లో డేంజర్ బెల్స్
posted on Dec 21, 2021 @ 8:47PM
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం 4 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. తాజాగా వచ్చిన కేసుల్లో మూడు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు కాగా... ఒకటి ఒమిక్రాన్ సోకిన వ్యక్తి కాంటాక్ట్. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 24కి చేరింది. వీటిలో 19 కేసులు నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు వెల్లడైంది.రాష్ట్రంలో కొన్నిరోజుల వ్యవధిలోనే కొత్త వేరియంట్ కేసులు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఒక ప్రయివేట్ ఆస్పత్రి డాక్టర్ కు ఒమిక్రాన్ సోకడం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన ఒమిక్రాన్ బాధితుడికి వైద్యం చేశాడు ఆ డాక్టర్. అతని భార్య కు కూడా కరోనా నిర్ధారణ అయింది. డాక్టర్ భార్య శాంపిల్ ను జినోమ్ సిక్వెన్స్ కు పంపించారు హెల్త్ సిబ్బంది. ఆస్పత్రిలో కాంటాక్ట్స్ అందరిని క్వారంటైన్ కు పంపింది హాస్పిటల్ యాజమాన్యం.ఇప్పటివరకు వచ్చిన ఒమిక్రాన్ కేసులన్ని విదేశాల నుంచి వచ్చిన వాళ్లవే కాగా... తొలిసారి కాంటాక్ట్ కూడా నిర్దారణ అయింది. దీంతో వైద్య వర్గాలు కలవరపడుతున్నాయి. ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి చెందితే దారుణమైన పరిస్థితులు ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇక దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటింది. ఒమిక్రాన్ కేసుల్లో ఢిల్లీ, మహారాష్ట్ర చెరో 54 కేసులతో ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 24 కేసులతో రెండో స్థానంలో ఉంది.