రఘువీరా రీ ఎంట్రీ నిజమేనా? ఆయనతో టచ్ లో ఉన్నదెవరు?
posted on Aug 4, 2021 @ 6:37PM
ఒక వెలుగు వెలిగిన సీనీ తారలు ఫేడ్ అవుట్ అయి కొంత కాలం తెర చాటున ఉండిపోవడం, ఆ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ట్రై చేయడం సినిమా లోకానికి తెలిసిన విషయమే. అలాగే ఇతర రంగాల్లో ఉన్నత స్థాయికి చేరిన లేదా పదవీ విరమణ చేసిన అధికారులు ఇతర రంగాలవైపు, ముఖ్యంగా రాజకీయాలా వైపు రావడం సహజం. నిన్న మొన్ననే, ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ తమ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ అరంగేట్రం చేశారు. త్వరలోనే ఆయన బీఎస్పీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
సహజంగా రాజకీయ నాయకులకు అలాంటి, అవసరం, అవకాశం రెండూ ఉండవు. ఎందుకంటే రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేది ఉండదు. జీవిత చరమాంకమ వరకు రాజకీయ నాయకులు రాజకీయాలే సర్వస్వంగా బతికేస్తుంటారు. అయితే, అప్పుడు అడప్పుడు కొందరు ఒక వయసు దాటిన తర్వాత ఇక రాజకీయాలు చాలని స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పు కుంటారు. మొరార్జీ దేశాయ్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేసిన, జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్ ముఖ్ 60 సంవత్సరాల వయసు నిండిన తర్వాత స్వచ్చందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మధ్య ప్రదేశ్ లో అత్యంత వెనకబడిన గోండ్వా ప్రాంతంలో అంత్యోదయ స్పూర్తితో ఏర్పాటు చేసిన స్వచ్చంద సంస్థ ద్వారా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి 60 నిండిన తర్వాత అధికార పదవుల నుంచి తప్పు కుంటానని ప్రకటించారు కానీ, ఆయనకు ఆ అవకాశం రాలేదు. 60 ఏళ్ళు నిండకుండానే అయన 2009 లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయనతో పాటు ఒకే సారి 1972లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే, వైఎస్ ఆప్త మిత్రుడు డాక్టర్ శివరామ కృష్ణా రావు, ఆద్యాత్మిక జీవితంపై మక్కువ పెంచుకుని ఈ సంవత్సరం (2021) ఏప్రిల్ 2 వతేదీన రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా నిజ సన్యాసం స్వీకరించారు. స్వామి శివరామ సరస్వతి గా మారి పోయారు.
అసలు విషయం ఏమంటే, వైఎస్ మంత్రివర్గంలోనే కాకుండా ఆ తర్వాత అంతకు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన, రఘువీరా రెడ్డి, చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర విభజన, అనంతరం ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పూర్తిగా చచ్చుపడి పోయిన కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు.ఆశించిన ఫలితం రానందుకో, ఇంకేందుకో ఆయన,2019లో పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇక ఆకక్ది నుంచి అప్రకటిత రాజకీయ సన్యాసం స్వీకరించారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ నిర్మాణానికి నడుం బిగించి, దిగ్విజయంగ ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. కొద్ది రోజుల క్రితం ఆలయ నిర్మాణం పూర్తయింది. జూన్ నెలలో విగ్రహ ప్రతిష్ట ఇతర కార్యక్రమాలు పూర్తి చేశారు.
ఇప్పుడు ఆయన రాజకీయ రీఎంట్రీ గురించి, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఓ వంక కాంగ్రెస్ నాయకులు రఘువీరతో టచ్ లోకి వచ్చారు. ఢిల్లీ నుంచి కూడా కాల్స్ వస్తున్నట్లు సమాచారం. మరో వంక దేవాలయ పున్నః నిర్మాణ పవిత్ర కార్యాన్ని పూర్తిచేసిన రఘువీరను, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అభినందించారు. అలాగే జేసీ సోదరుడు, తాడిపత్రి టీడీపీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి స్వయంగా రఘువీరాను కలిసి, రాయలసీమ నీటి హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని సూచించారు. అయితే రఘువీర ఎలానూ స్పందించలేదు. మౌనంగా ఉండి పోయారని సమాచారం. ఆయన మనసులో ఏముందో ... ఆయన ఏలాంటి నిర్ణయం తెసుకుంటారో .. చూడవలసి వుంది. ప్రస్తుతానికి అయితే రఘువీర ఒక విధంగా తమ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని మరిచిపోయి, టీవీఎస్ 50 ద్విచక్రవాహనం మీద తిరుగుతూ .. రచ్చబండ రాజకీయాలకు పరిమితం అయ్యారు. రేపు ఏమవుతుందో ..?