పెద్దలు చెబితే వినరా? జగన్ తో ఏపీకి జల గండమా?
posted on Aug 4, 2021 @ 6:37PM
ఆవేశం అజ్ఞానానికి, అజ్ఞానం అవివేకానికి, అవివేకం అనర్థానికి దారి తీస్తుందని గీతాచార్యుడు ఏనాడో చెప్పి ఉన్నాడు. ఆనాడు ఆయన చెప్పిన మాటలు పాటిస్తున్నవాళ్లు జీవిత పోరాటంలో అనేక విజయాలు నమోదు చేస్తున్నారు. పెడచెవిన పెట్టినవారు అపకీర్తి అనే పాతాళానికి దిగజారిపోతున్నారు. తాజాగా జగన్ సర్కారు తీసుకున్న దుందుడుకు నిర్ణయం కూడా అలాంటిదేనంటున్నారు రాజకీయ నిపుణులు.
కృష్ణా జలాల వివాదంలో తెలంగాణ అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీంను ఆశ్రయించిన జగన్ సర్కారుకు... సాక్షాత్తూ దేశ ప్రధాన న్యాయమూర్తి సూచించిన హిత వచనాలు కూడా రుచించలేదు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆప్తుడైన జస్టిస్ ఎన్వీ రమణ.. రెండు రాష్ట్రాల ప్రజల క్షేమాన్ని ఆలోచించి.. ఈ సమస్యకు న్యాయపరమైన పరిష్కారం కన్నా కూర్చుండి చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే మంచిదని సూచించారు. అవసరమైతే మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధమని కూడా ఆయన అన్నారు.
ఒకవేళ న్యాయ పరమైన పరిష్కారమే కావాలనుకుంటే వేరే ధర్మాసనానికి కేసు బదిలీ చేస్తానని కూడా సీజేఐ జస్టిస్ రమణ చెప్పారు. ఇదంతా దేన్ని సూచిస్తుంది? సమస్యలో మిళితమై ఉన్న సెంటిమెంట్లు, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలన్న అభిలాష మేరకే రమణ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. ముఖ్యంగా దశాబ్దాల తరబడి రెండు ప్రాంతాల రైతుల మధ్య అపనమ్మకాలు రాజేసిన ఇలాంటి జీవజలాల సమస్యను సహృదయ వాతావరణంలో కూర్చుండి మాట్లాడుకోవడం కన్నా మేలైన పరిష్కారం ఉండదని నిపుణులంతా చెబుతున్నారు. ఇలా చేస్తే పరిష్కారం కూడా త్వరగా తేలిపోతుందన్న విషయం కూడా జగమెరిగిన సత్యమే.
కానీ జగన్ మాత్రం మొండిగా న్యాయపోరాటానికే ఓటేయడం అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు తావిస్తోంది. ఎన్వీ రమణ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పట్ల ఎంతో నమ్మకాన్ని, గౌరవాన్ని కనబరచారు. వారిద్దరి కలయికలోనే ఈ సమస్యకు ఓ మంచి సొల్యూషన్ రావడానికి బీజం పడిందని భావిస్తున్నారు. అయితే జస్టిస్ రమణ సూచించిన పారదర్శకమైన సూచనను జగన్ పట్టించుకోకపోవడం ఆయనలోని మొండివైఖరికి నిదర్శనమన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అటు కేంద్ర సర్కారు కూడా సీజేఐ ధర్మాసనమే విచారించాలని కోరడాన్ని గమనించాలి. అయినప్పటికీ కేంద్రానికి కూడా రమణ ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని చెప్పడం ఆయనలోని స్వచ్ఛతకు నిదర్శనంగా నిలుస్తోంది. న్యాయరంగంలో అపారమైన అనుభవం ఉన్న వ్యక్తే న్యాయపరమైన పరిష్కారం కాకుండా మధ్యవర్తిత్వమే మంచిదని చెప్పిన మాటలను జగన్ నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం తెలివైన పని కాదంటున్నారు జలరంగ నిపుణులు. న్యాయపరమైన విచారణ వల్ల ఏళ్లపాటు విచారణ సాగుతుందని, నీటిపంపకాల విషయంలో పెనవేసుకొని ఉన్న అనేక టెక్నికల్ అంశాల కారణంగా సమస్య కొలిక్కి రావడం అంత తేలిక కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి అసలు జగన్ కు సమస్య పట్ల చిత్తశుద్ధే లేదని, ఏపీలో జగన్ పరపతి అడుగంటుతున్న క్రమంలో వ్యక్తిగత రాజకీయాల కోసమే రెండు ప్రాంతాల మధ్య గల సున్నితమైన సమస్యను కెలుకుతున్నారని, ఈ వైఖరి వల్ల భవిష్యత్తులో ఏపీకి ఏవిధంగా లాభం జరుగుతుందంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ తెలిసితెలిసీ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తారా అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.