కేసీఆర్ చెబితేనే సంజయ్ పాదయాత్ర ఆగిందా?
posted on Aug 3, 2021 @ 7:42PM
తెలంగాణ రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ప్రధాన పార్టీలన్ని దూకుడు పెంచడంతో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. హుజురాబాద్ కేంద్రంగానే రాజకీయాలు సాగుతుండగా.. ఉప ఎన్నిక ఇప్పట్లో జరిగే అవకాశం లేకపోవడంతో కొంత వేడి తగ్గింది. ఆగస్టు9 నుంచి పాదయాత్రకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర అనూహ్యంగా వాయిదా పడింది. సంజయ్ యాత్ర ఆగస్టు చివరి వారంలో ఉంటుందని బీజేపీ వర్గాలు చెబుతున్నా.. దానిపై క్లారిటీ లేదు. అసలు బండి సంజయ్ పాదయాత్ర ఉంటుందా లేదా అన్నదానిపైనా స్పష్టత రావడం లేదు.
బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాల వల్లే సంజయ్ యాత్రకు హైకమాండ్ బ్రేకులు వేసిందనే ప్రచారం జరుగుతుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేయడం వల్లే ఆగిపోయిందని చెబుతున్నారు. ఈటల విషయంలో సంజయ్ వ్యవహారశైలి సరిగా లేదనే ఫిర్యాదులు హస్తినకు వెళ్లాయని అంటున్నారు. బీజేపీ వర్గాలు మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యాత్ర, పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రను వాయిదా వేశామని చెప్పారు.
తాజాగా బండి సంజయ్ పాదయాత్ర ఆగిపోవడంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పెద్దలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ టచ్ లో ఉన్నారని చెప్పారు. అందుకే ప్రధాని మోడీ ప్రజావ్యతిరేక విధానాలపై కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు మాట్లాడటంలేదని తప్పుబట్టారు. కేసీఆర్ ఎవరి పక్షమో తేలిపోయిందన్నారు. కేసీఆర్ ఒత్తిడివల్లే పాదయాత్రను బీజేపీ నేత బండి సంజయ్ వాయిదా వేసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు మోడీకి కేసీఆర్ లొంగిపోయారని ఎద్దేవాచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ లక్ష్యంగానే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.