రాజకీయాలు అందరు ఆడే ఆట కాదు.. ఎన్టీఅర్, ఎమ్జీఆర్ వంటి కారణజన్ములు కొందరే!
posted on Aug 3, 2021 @ 7:15PM
ఒక అమితా బచ్చన్, ఒక టెండూల్కర్, ఒక ఎన్టీఆర్, ఒక ఎమ్జీఆర్, ఒక చిరంజీవి, ఒక హేమమాలిని, ఒక జయప్రద, జయసుధ, ఒక బాలయ్య బాబు... ఒక కీర్తి ఆజాద్, ఒక బాబుల్ సుప్రియో... ఇంకా ఇలాంటి ఇంకెందరో, ఈ అందరి మధ్య ఒక పోలిక ఉంది. వీరంతా సెలేబ్రిటీలు. క్రికెట్, సినిమా రంగాలలో పేరున్న హీరోలు. అయితే అందులో విశషం ఏముంది? అనిపించవచ్చును. కానీ ఈ అందరి మధ్య మరో ముఖ్య పోలిక కూడా వుంది. వీరంతా రాజకీయాలలో కూడా వేలు పెట్టారు. కొందరు సీరియస్ గా సిన్సియర్ గా రాజకీయాలు చేశారు. రాజకీయాలలో నిలతొక్కుకున్నారు, రాణించారు.
మన నందమూరి తారక రామ రావు (ఎన్టీఅర్) అయితే రాజకీయలలోనూ చరిత్ర సృష్టించారు. పార్టీ (టీడీపీ) పెట్టిన 11 నెలలకే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. అలాగే మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఎమ్జీఆర్, జయలలిత, కరుణానిధి ఇలా సినీ రాజకీయ నాయకులు అటూ ఇటూ రెండువైపులా రాణించారు. ఇప్పటికి కూడా ఇతర రంగాల్లో రాణించిన సెలేబ్రిటీలు రాజకీయ రంగంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమిళనాడులో కమల్ హసన్, ఏపీలో పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మధ్యనే మాజీ క్రికెటర్ నవజ్యోతి సింగ్ సిద్దు, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ని స్టంపౌట్ చేసి ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ గా సెలెక్ట్ అయ్యారు.
ఇక బాబుల్ సుప్రియో, బెంగాలీ గాయకుడు. పశ్చిమ బెంగాల్లో మంచి గుర్తింపున్న సింగర్. సినిమా గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. బెంగాలీతో పాటుగా హిందీ తదితర భాషల్లో కూడా కొన్నిపాటలు పాడారు. బాబుల్ సుప్రియో సినిమా పాటలు, సంగీతం విషయాన్ని పక్కనే పెడితే.. ఆయన 2010లో రాజకీయ అరంగేట్రం చేశారు. బీజేపీలో చేరారు. సెలబ్రిటీ కావడంతో చకచక పైమెట్టు ఎక్కుతూ, 2014లో అసన్సోల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అంతే కాదు, ఫస్ట్ టైమ్ ఎంపీ అయినా, మోడీ మొదటి మంత్రి వర్గంలో సెలబ్రిటీ కోటాలో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత 2019లో రెండవ సారి అదే స్థానం నుంచి గెలిచారు. మోడీ సెకండ్ కాబినెట్’లోనూ మంత్రి పదవి దక్కింది.
అయితే ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్తీకరణ సందర్భంగా ప్రదాని ఉద్వాసన పలికిన 12 మంత్రులలో సుప్రియో కూడా ఒకరు. ఇక అక్కడి నుంచి అయనలో రాజకీయ వైరాగ్యం మొదలైంది. మూడు నాలుగు రోజుల క్రితం ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు. అంతే కాదు ‘రాజకీయాలకు ఒక నమస్కారం’ అంటూ పాలిటిక్స్ కు గుడ్ బై చెపుతున్నానని చెప్పుకొచ్చారు. ఇంకొక పార్టీలో చేరే ఆలోచన గానీ, ఇంకొకటి గానీ లేవని, ఢిల్లీలో బంగాళా, సెక్యూరిటీ సరండర్ చేస్తున్నానని నిజాయతీని ప్రదర్శించే ప్రయత్నం చేసారు. నిజమే కామోసు అనుకునే వారు అనుకున్నారు. కానీ, ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుదు జేపీ నడ్డను కలిసిన తర్వాత ఆయన స్వరం మారింది. రాజకీయాలకు దూరంగా ఉంటా కానీ ... ఎంపీగా కొనసాగుతా అని కొత్త రాగం ఎత్తుకున్నారు.
బాబుల్ సుప్రియో డ్రామా చేస్తున్నారని, కొద్దిగా బెట్టు చేస్తేనో, బెదిరిస్తేనో మంత్రి పదవి మళ్ళీ వస్తుందని ఆశించారని తృణమూల్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. అటు నుంచి రియాక్షన్ ఇంకోలా ఉండడంతో, టోన్ మార్చి కొత్త పల్లవి ఎత్తుకున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సినిమా, క్రీడా రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న కొందరు, రాజకీయ రంగంలో వేలు పెట్టి, చివరకు ఇలా బాబుల్ సుప్రియోలా. అవకాశం ఉన్నంత వరకు పదవులు అనుభవించి, అవి చేజారి పోగానే, పక్కకు తప్పుకోవడం చాలా మంది విషయంలో ఒక దురాచారంగా మారింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, చిరంజీవి ఇదే కోవకు వస్తారు. ఆయన సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రంలో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గంలో మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. అనుభవించవలసినవి అన్నీ అనుభవించారు. చివరకు 2019 లో కాంగ్రెస్ ఓడిపోయినా తర్వాత కూడా రాజ్య సభ పదవీ కాలం ముగిసే వరకు ఆ హోదాను అనుభవించారు.
కట్ చేస్తే ఇక అక్కడి నుంచి కాంగ్రెస్ నుంచి దూరం జరుగుతూ ... సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చారు. అమ్మడు కుమ్ముడు మూడ్ లోకి వచ్చేశారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి కొత్త ప్రయత్నాల్లో ఉన్నారు. జగన్ రెడ్డితో దోస్తీ చేసి, రాజ్య సభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందరూ కాక పోయినా, కొందరు సెలబ్రిటీలు రాజకీయాలకు పనికిరారు. క్రికెట్ మైదానంలో సిక్సర్ల మీద సిక్సర్లు, శతకాల మీద సెంచరీలు కొట్టిన టెండూల్కర్, రాజ్య సభలో డక్ అవుట్ అయ్యారు. ఆయన ఆరేళ్లలో సభకు హాజరైంది అతి తక్కువ. ఇక సభలో ప్రజాసమస్యలు ప్రస్తావించింది అయితే మరీ తక్కువ. అలాగే ఇంకా చాలామంది. సో .. మెరిసేదంతా బంగారం కాదు ... రాజకీయాలు అందరూ ఆడే అట కాదు .. అందరూ చేయగల నటనా కాదు. ఎన్టీఅర్, ఎమ్జీఆర్ వంటి కారణజన్ములు కొందరే ఉంటారు.