పిట్టల పోయి బండా వచ్చే..! గంటల్లోనే చక్రం తిప్పిన కేకే..
posted on Nov 16, 2021 @ 3:16PM
కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపిన శాసనమండలి అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ప్రకటించారు సీఎం కేసీఆర్. గతంలో ఎప్పుడు లేనంతగా కసరత్తు చేసిన కేసీఆర్.. చివరికి ఊహించని ట్విస్టులు ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్ గా పని చేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వెంకట్రామిరెడ్డిని మండలికి ఎంపిక చేసిన కేసీఆర్.. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను అభ్యర్థిగా ప్రకటించి అందరికి షాకిచ్చారు.
బండా ప్రకాష్ ఎంపిక రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయనకు ఎంపీగా ఇంకా మూడేండ్ల 8 నెలల సమయం ఉంది. గతంలోనూ ఎంపీలుగా ఉన్నవారిని.. ఆ పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా చేసిన సందర్భాలు చాలా తక్కువ. అంతేకాదు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతున్నప్పటి నుంచి చాలా మంది పేర్లపై లీకులు వచ్చినా.. ఎప్పుడు బండా ప్రకాష్ పేరు రాలేదు. అయితే చివరి రోజున సడెన్ గా ఆయన పేరు తెరపైకి వచ్చింది. దీని వెనుక పెద్ద కథే నడిచిందని అంటున్నారు.
భూ కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ ను గత జూన్ లో కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు కేసీఆర్. ఈటల ముదిరాజ్ వర్గానికి చెందిన నేత. ఆయనను తప్పించడంతో ముదిరాజులు సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలిపారు. బీసీ సంఘాలు కూడా కేసీఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలోనూ దీని ప్రభావం కనిపించింది. దీంతో ముదిరాజులను కూల్ చేసేందుకు ఆదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మండలికి పంపించాలని కేసీఆర్ నిర్ణయించారని వార్తలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన పిట్టల రవీందర్ పేరును కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని, పిట్టలకు సీఎంవో నుంచి సమాచారం వచ్చిందని ప్రచారం జరిగింది. ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఈటల స్థానంలో.. అదే సామాజిక వర్గానికి చెందిన ఉద్యమ నేత పిట్టల రవీందర్ ను భర్తీ చేస్తే.. తనపై వచ్చిన అసంతృప్తి కూడా చల్లారుతుందని కేసీఆర్ భావించారని చెబుతున్నారు.
అయితే మండలి అభ్యర్థుల ఎంపికలో రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. పిట్టల రవీందర్ ప్లేసులో ఎంపీగా ఉన్న బండా ప్రకాష్ పేరు వచ్చి చేరింది. దీని వెనుక ఎంపీ కేశవరావు చక్రం తిప్పారని అంటున్నారు. రవీందర్ కు కాకుండా బండాను ఎంపిక చేయడంలో కేకేనే కీలకపాత్ర పోషించారని అంటున్నారు. కవితకు రాజ్యసభ సీటు దక్కేలా కేశవరావు ఇలా స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఎమ్మెల్సీగా ఉంటే ఇక్కడ కవిత మంత్రి పదవి కావాలని కోరుతుందని, అదే ఢిల్లీకి పంపితే ఏ సమస్యా ఉండదని కేసీఆర్ కు కేకే చెప్పారని తెలుస్తోంది. దీని వల్ల కేటీఆర్ కు పోటీ లేకుండా పోతుందని వివరించారట. ప్రకాష్ కు ఎమ్మెల్సీ ఇచ్చి.. ఆయన స్థానంలో కవితను రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని చెప్పారట. కేకే సూచనతో కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించి పిట్టల రవీందర్ కు కాకుండా బండా ప్రకాష్ ను ఎంపిక చేశారని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి. మొత్తంగా కేకే చివరి నిమిషంలో చక్రం తిప్పడంతో కరుడుగట్టిన తెలంగాణ వాదికి ఎమ్మెల్సీ సీటు చేజారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.