కవిత భవిష్యత్తు తేలిపోనుందా? కూతురుని మళ్లీ ఎమ్మెల్సీ చేస్తారా?
posted on Nov 10, 2021 @ 5:25PM
కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ. ఆమె పేరు చివరన ఎమ్మెల్సీ పదానికి త్వరలోనే గడువు ముగియనుంది. మరోసారి కవితను ఎమ్మెల్సీని చేస్తారా? చేయరా? అనేది టీఆర్ఎస్‌లో కీలక పరిణామాలకు వేదిక కానుంది. ఇప్పటికే తండ్రీ-కూతురుకి, అన్నా-చెల్లికి అసలే మాత్రం సత్సంబంధాలు లేవు. కవితకు ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ కూడా నిషేధించబడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రావడం.. ఇదే టైమ్‌లో కవిత పదవీకాలం కూడా ముగియడం ఆసక్తికరంగా మారింది.
14 నెలల క్రితమే నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయిన కల్వకుంట్ల కవిత పదవి కాలం ముగిసిపోయింది. డీఎస్ సన్నిహితుడు భూపతిరెడ్డిపై అనర్హతా వేటు వేయించి మరీ ఆ సీటును కవితకు కట్టబెట్టారు. చివర్లో వచ్చారు కాబట్టి.. ఆరేళ్ల పదవి కాస్తా 14 నెలల్లోనే సమాప్తమైంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ కూడా విడుదల అయింది. ఇప్పుడు కవిత మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీ చేస్తారా? కేసీఆర్ కూతురుకు మరోసారి చాన్స్ ఇస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మునుపటిలా పరిస్థితులు ఉండుంటే.. కవితకు ఎమ్మెల్సీ రెన్యూవల్ కన్ఫామ్‌గా జరిగుండేది. కానీ, ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో కోల్డ్‌వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. పార్టీలో కవిత జాడే లేకుండాపోయింది. ఇటీవలి టీఆర్ఎస్ ప్లీనరీకి సైతం కవిత డుమ్మా కొట్టి దుబాయ్ డ్రామాతో దాగుడుమూతలు ఆడారు. అన్న కేటీఆర్‌కు రాఖీ కూడా కట్టలేనంత వైరం వారి మధ్య ఏర్పడింది. ప్రగతిభవన్‌లో బతుకమ్మ కూడా ఆడలేనంత దూరం పెరిగిపోయింది. కవితను దాదాపు పక్కనపెట్టేసినట్టే కనిపిస్తోంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడంలో మనస్పర్థలు, ఆస్థి గొడవలు ఇలా రకరకాల కారణాలు ప్రచారంలో ఉన్నా.. నిజమేంటో వారికే తెలియాలి. ఇలా ఫ్యామిలీ డ్రామా నడుస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. కవిత రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే పరిణామంగా చూస్తున్నారు.
కవితను ఎమ్మెల్సీ చేయాలనుకుంటే.. ఎమ్మెల్యేల కోటాలోనో, స్థానిక సంస్థల ఖాతాలోనో.. గవర్నర్ కోటాలోనో.. ఏదో ఒక విధంగా మండలికి పంపించవచ్చు. బోలెడన్ని ఖాళీలు ఉండటం.. వడ్డించే వాడు తండ్రే కావడంతో.. కవిత ఎమ్మెల్సీ కావడం చాలా ఈజీ. కానీ... ప్రస్తుత పరిస్థితుల్లో కవితను మరోసారి ఎమ్మెల్సీని చేస్తారా? లేదా? అనేది రాజకీయంగా ఇంట్రెస్టింగ్ పాయింట్.