విశాఖ స్వామితో జగన్‌కు చెడిందా? అందుకే గురూజీని మార్చేశారా?
posted on Oct 23, 2021 @ 3:14PM
వైఎస్ జగన్ పక్కా క్రిష్టియన్. కానీ, అప్పుడప్పుడూ హిందువు అవతారమెత్తుతారు. అవసరం పడినప్పుడల్లా హిందువులా కనిపిస్తారు. పంచకట్టి.. బొట్లు గట్రా పెట్టి.. దండాలు పెడతారు. జగన్ హిందువా? క్రిష్టియనా? అనే అనుమానం వచ్చేంతగా రక్తి కట్టిస్తారు. ఇలా, ఇరు వర్గాలనూ ఆకట్టుకునే ప్రయత్నాలు తరుచూ చేస్తుంటారు.
ఇక, జగన్ అంటే విశాఖ శారదా పీఠం స్వామీజీకి ఎంతో ఇష్టం. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. తనకు జగన్, కేసీఆర్ రెండు కళ్లలాంటి వాళ్లని అన్నారు. జగన్ గెలవాలని తాను బలంగా కోరుకున్నానని చెప్పుకొచ్చారు. అసలు, సర్వసంఘ పరిత్యాగులైన స్వామీజీలకు.. ఇలా రాజకీయాలపైనా, రాజకీయ నేతలపైనా.. ఎందుకంత ఆసక్తో అర్థం కానే కాదు. అదంతా వేరే విషయం.
ఇక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటి జగన్ వేరు.. ముఖ్యమంత్రి జగన్ వేరు అనే విషయం ఆయన ప్రియతమ గురుజీ స్వరూపానందేంద్ర స్వామికి త్వరగానే తత్వం బోధపడినట్టుంది. జగన్ సీఎం అయ్యాక ఏపీ వ్యాప్తంగా ఆలయాలపై దాడులు, తిరుమలలో అన్యమత ప్రచారం, అర్చకులకు జీతాలు ఆలస్యం, ఫాస్టర్లు, ఇమామ్‌లకు జీతాలు ఇవ్వడం, ఏపీలో భారీగా మత మార్పిడిలు.. ఇలా అనేక విషయాల్లో జగన్ పాలనపై విశాఖ స్వామీజీ ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. ఇక, ఇటీవల అర్చకుల సమస్యలను స్వామీజీనే నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లినా అవి ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంపై శారదా పీఠం కినుక వహించిందని అంటున్నారు. అందుకే, జగన్‌ను స్వామీజీ.. స్వామీజీని జగన్ దూరం పెట్టారని ప్రచారం జరుగుతోంది.
బహుషా అందుకే కాబోలు.. సీఎం జగన్‌రెడ్డి కొత్తగా వేరే స్వామీజీని చూసుకున్నారని అంటున్నారు. తాజాగా గణపతి సచ్చిదానంద స్వామీజీని ముఖ్యమంత్రి జగన్ కలవడం ఆసక్తిగా మారింది. జగన్‌ను గణపతి సచ్చిదానంద దీవించడం.. వైసీపీ పాలననూ కొనియాడటం.. ఆలయాలపై దాడులపైనా రాజకీయ తరహా వ్యాఖ్యలు చేయడం.. ఇవన్నీ జగన్‌కు కొత్త గురూజీ ఆశ్రయం దొరికిందనే అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. కాస్త రెబెల్‌గా ఉండే విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామీకి జగన్ తీరు ఏమాత్రం నచ్చకపోవడంతో.. తన శిష్యుడిని పక్కనపెట్టేశారని.. అందుకే జగన్‌రెడ్డి కొత్తగా గణపతి సచ్చిదానందను చూసుకున్నారని అంటున్నారు.
ఇక ఏపీ సీఎం తనను పట్టింకోవడం లేదని గ్రహించారో లేక ఆయనపై రగిలిపోతున్నారో తెలియదు కాని.. శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి తెలంగాణలో ఎక్కువగా తిరుగుతున్నారు. సీఎం కేసీఆర్ ను అదే పనిగా పొగిడేస్తున్నారు. యాదాద్రి ఆలయాన్ని అద్బుతంగా నిర్మించారంటూ కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు స్వరూపానందేంద్ర స్వామి. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారంటూ ఆకాశానికెత్తారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఏపీ సీఎం స్వరూపానందను కాకుండా మరో స్వామిజీ దగ్గరకు వెళ్లడం.. స్వరూపానందేంద్ర తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రసంశలు కురిపించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. స్వరూపానందేంద్ర స్వామిజీ, ఏపీ సీఎం జగన్ మధ్య ఎదో జరిగింది, జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి.