రైతు పొలంలో రోడ్డు.. వైసీపీ ఎమ్మెల్యే అరాచకం...
posted on Oct 23, 2021 @ 3:23PM
అంతా నా ఇష్టం.. అంతా మా ఇష్టం.. అడిగేదెవడ్రా మా ఇష్టం.. తెలుగు సినిమాలోని ఈ సాంగ్ అప్పట్లో ఎంతో సంచలనం. ఈ పాట జనాల్లోకి బాగా వెళ్లింది. ఏపీలో ప్రస్తుతం అధికార వైసీపీ నేతల తీరు కూడా అచ్చం ఇలానే కనిపిస్తోంది. ఎన్ని ఆరోపణలు వచ్చినా, విమర్శలు వచ్చినా, జనాలు ఛీదరించుకుంటున్నా, కోర్టులు మొట్టికాయలు వేసినా... జగన్ రెడ్డి పార్టీ లీడర్లు దౌర్జన్యాలు ఆపడం లేదు. తమకు ఇష్టమెచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. కబ్జాలకు పాల్పడుతున్నారు. యథేచ్చగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. తమను ప్రశ్నించే వారిపై ప్రతీకారాలకు దిగుతున్నారు వైసీపీ ప్రజా ప్రతినిధులు.
తాజాగా అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి భూ ఆక్రమణ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. శింగనమల నియోజకవర్గంలోని కొర్రపాడు గ్రామంలో నాగలింగారెడ్డి అనే రైతు పంట పొలాన్ని ఎమ్మెల్యే పద్మావతి ఆక్రమిస్తున్నారనే వీడియోతో పాటు పంట పొలంలో రైతులపై దౌర్జన్యం చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కొర్రపాడు పక్కన ఉన్న హైవేపై రైతు నాగలింగారెడ్డికి పొలం ఉంది. ఆ పొలం పక్కనే ఎమ్మెల్యే జొన్నల గడ్డ పద్మావతి కుటుంబీకులు ఇటీవల ఐదు ఎకరాల పొలం తీసుకున్నట్లు సమాచారం. ఆ పొలానికి వెళ్లడానికి వేరే దారి ఉన్నప్పటికీ ప్రధాన రహదారి నుంచి రోడ్డు వేసుకోవాలనేది వారి ఆలోచన. ఎమ్మెల్యే పొలానికి దారి లేకపోవడంతో రైతు నాగలింగారెడ్డి పొలంపై కన్నేశారు. ఆ పొలం నుంచి దారి వేసుకోవడానికి రైతు వేసిన పచ్చటి వరి పైరును ట్రాక్టర్‌తో తొక్కించారు.
దీంతో తమ పొలాన్ని ట్రాక్టర్‌తో తొక్కించారంటూ రైతు నాగలింగా రెడ్డి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి తమను రక్షించాలంటూ వేడుకున్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఎలాంటి దారి లేకున్నా తమ భూముల నుంచి రోడ్డు ఏర్పాటు చేసుకుంటున్నారంటూ రైతు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.