మంత్రి కొప్పులకు అవమానం.. గరంగరమవుతున్న దళితవర్గం..
posted on Oct 23, 2021 @ 2:56PM
కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా? రాదనేదే సామెత అర్థం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దళితుల పట్ల చూపిస్తున్న ప్రేమ కూడా అలాంటిదేనా, అంటే అవునంటున్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన మేధావులు. నిజానికి గడచిన ఏడేళ్లలో దళితునికి ముఖ్యమంత్రి పదవి, కుటుంబానికి మూడెకరాల భూమి మొదలు దళితులకు ఇచ్చిన ప్రత్యేక హామీ ఏదీ కూడా తెరాస ప్రభుత్వం నెరవేర్చ లేదు. చివరకు ఇచ్చిన ఉపముఖ్యమంత్రి పదవిని కూడా.ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి గుంజుకున్నారు.
గతం గతః... కనీసం హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం తెచ్చిన దళిత బంధు పథకాన్ని అయినా నిజాయతీగా అమలు చేశారా, అంటే అదీ లేదు, మోచేతికి బెల్లం రాసి నాలుకతో నాకమన్నట్లుగా, ఖాతాల్లో పదిలక్షల రూపాయలు వేసి పైసా ముట్టుకునేందుకు లేకుండా లేకుండా అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. ఇపుడేమో, ఎన్నికల సంఘం ఆంక్షలు విధిస్తే, ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద నెట్టి ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకున్నారు. దీంతో దళిత మేథావులు, దళిత సామాజిక కార్యకర్తలు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా, ముఖ్యమంత్రి, తెరాస ప్రభుత్వం మరోసారి పద్దతి ప్రకారం దళితులను మోసం చేశారనే ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.
ఇదిలా ఉండగానే హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దళితమంత్రి కొప్పుల ఈశ్వర్’ కు జరిగిన అవమానం దళితులలో, దళిత నాయకులలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేస్తోంది. ఈ నేపధ్యంలోనే మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకెంతకాలం ఈ అవమానాలు భరిస్తారంటూ మంత్రి కొప్పులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘కొప్పుల ఈశ్వర్ గారూ, కనీస సంస్కారం లేని దొరల-గడీల పార్టీలో ఎంతకాలం ఇట్ల అవమానాలు భరిస్తూ బందీగుంటరు? అంటూ ట్వీట్ లో తమ ఆవేదనను వ్యక్త పరిచారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
విషయంలోకి వెళితే హుజురాబాద్ నియోజక వర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కొప్పుల్ ఈశ్వర్ మాట్లాడుతున్న సమయంలో మరో మంత్రి హరీష్ రావు వేదిక మీదకు వచ్చారు. ఆయన రాగానే ఆయనకు స్వాగతం పలికేందుకు మరో నాయకుడు కొప్పుల చేతిలోని మైకు లాక్కున్నారు. ఈ సంఘటన దళిత వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హరీశ్ రావుకి స్వాగతం చెప్పేందుకు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ని దారుణంగా అవమానించారని.. ఇంకెన్నాళ్లు ఈ బానిస బతుకు అంటూ బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌కి నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.హరీశ్ వచ్చాడని సాటి మంత్రి, అందులోనూ దళిత సామాజిక వర్గానికి చెందిన మంత్రి చేతిలో నుంచి మైక్ లాక్కోవడం దళితులనే కాదు, సామాన్య వర్గాల ప్రజలు అందరినీ ఆగ్రహానికి గురిచేసింది.
దళితుల పట్ల కపట ప్రేమను ఒలకబోసే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఏమి సమాధానం చేపుత్రని ప్రశ్నిస్తున్నారు. మంత్రి కొప్పుల వద్ద నుంచి మైక్ లాక్కుంటున్న వీడియోను షేర్ చేసిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ ఇంకెంతకాలం ఈ అవమానాలు భరిస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కొప్పుల ఈశ్వర్ గారూ, కనీస సంస్కారం లేని దొరల-గడీల పార్టీలో ఎంతకాలం ఇట్ల అవమానాలు భరిస్తూ బందీగుంటరు? ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మీ గుండె ఎన్ని సార్లు గాయపడ్డదో మీతో కలసి పనిచేసిన నాకు తెలియంది కాదు. అందుకే గడీలలో బందీలైన సమస్త బహుజననాయకుల్లారా, ఇకనైనా బానిసత్వ సంకెళ్లు తెంపుకోండి’’ అంటూ భావోద్వేగంతో ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆర్‌ఎస్ ప్రవీణ్ ట్వీట్‌కి నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. కాన్షీరాం రాసిన చెంచా యుగం పుస్తకం గుర్తొచ్చిందని.. అవమానాలు భరిస్తూ ఎందుకు దొరల పార్టీలలో ఉండాలి , బానిస సంకెళ్లు తెంచుకుని బహుజన రాజ్యం కోసం రావాలని కొప్పుల ఈశ్వర్‌ని ఉద్దేశించి కామెంట్ చేస్తున్నారు. ఆత్మాభిమానం చంపుకొని అగ్రవర్ణ పార్టీలకు పనిచేయడం అవసరమా మంత్రిగారు.? ఇప్పటికైనా కండ్లు తెరవండంటూ హితవు పలుకుతున్నారు.దీంతో దళితబంధు సంగతేమో కానీ, తెరాసకు దొరల పార్టీ ముద్ర అయితే గట్టిగానే పడిందని అంటున్నారు.ఈ ప్రభావం హుజూరాబాద్ ఉపేన్నికపై ఏ విధంగా. ఏ మేరకు ఉంటుందనేది చూడవలసి ఉందని అంటున్నారు.