ఉప ఎన్నికల్లో బీజేపీకి షాక్.. మోడీకి డేంజర్ సిగ్నల్స్?
posted on Nov 2, 2021 @ 5:14PM
తెలంగాణలోని హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన బీజేపీ.. దేశంలోని మిగితా రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం చేదు ఫలితాలు చవి చూసింది. అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగించింది. బీజేపీని వెనక్కి నెట్టి ఈ ఉప ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది.
29 అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాల్లో కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించింది. బీజేపీ కేవలం 7 స్థానాలనే గెలుచుకుంది. రాజస్తాన్-2, హిమాచల్ ప్రదేశ్-3, మధ్యప్రదేశ్-1, కర్ణాటక-1, మహారాష్ట్ర-1 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్‌లో రెండు స్థానాలకు రెండు కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు స్థానాలనూ కాంగ్రెసే గెలిచి సంచలనం నమోదు చేసింది. బీజేపీ అస్సాంలో అత్యధికంగా 3 స్థానాలు గెలుచుకుంది. మధ్యప్రదేశ్‌లో 2, కర్ణాటకలో ఒకటి, తెలంగాణలో ఒక స్థానంలో గెలిచింది.
2014 తర్వాత వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో ఆ పార్టీ కేడర్ లో జోష్ కనిపిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ గెలవడం ఆసక్తిగా మారింది. దేశంలో పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ , గ్యాస్ రేట్లతో బీజేపీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. రైతుల ఆందోళనకు అన్ని వర్గాల మద్దతు లభించింది. దాని ప్రభావం ఉప ఎన్నికలో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి ఇది మరింతగా పెరుగుతుందని, ఉప ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోడీ ప్రభుత్వానికి డేంజర్ సిగ్నల్స్ ఇచ్చాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.