ఇప్పటికి అమరావతే.. మూర్ఖుడు మారుతాడా.. కొండపల్లి రచ్చ.. మరో గండం.. టాప్ న్యూస్@7PM
posted on Nov 22, 2021 @ 6:06PM
ఏపీ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ.. 3 రాజధానుల బిల్లును మెరుగుపరుస్తామని తెలిపారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామని చెప్పారు.సమగ్రమైన బిల్లుతో మళ్ళీ సభ ముందుకు వస్తాం. అందరితో చర్చించి అవాంతరాలు లేకుండా ఈ సారి కొత్త బిల్లు పెడతామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
--------
మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అని సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని ట్విట్టర్‌లో లోకేష్ మండిపడ్డారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. 3 రాజధానులు చేయమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అన్నారు. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని నారా లోకేష్ అన్నారు.
--------
జగన్ సీఎం అయిన తర్వాత ప్రజాస్వామ్య విలువలు దిగజారి పోతున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విమర్శించారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనుక జగన్ పాత్ర ఉందని ఆరోపించారు. సీఎం మహిళలపై గౌరవం ఉంటే.. తన సభ్యులతో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేశారు.దేశ చరిత్రలో ఏపీ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారుడు ఎక్కడా చూడలేదన్నారు.
--------
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కీలక మలుపు చోటుచేసుకుంది. కౌన్సిల్ హాల్‌లో జరిగిన రభస అనంతరం తమకు రక్షణ లేదని టీడీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. తమను మున్సిపల్ భవనంలోనే ఈ రాత్రికి ఉండేందుకు అనుమతివ్వాలని కౌన్సిలర్లు అధికారులను కోరారు. రిటర్నింగ్ అధికారికి ఎంపీ కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్లు లేఖ ఇచ్చారు. ఎంపీ నాని ఓటు హక్కుపై కోర్టులో కేసు సాగుతుండటంతో.. ఎన్నికను రేపటికి ఎన్నికల అధికారి వాయిదా వేశారు.
-----
దక్షిణాంధ్రకు మరో ప్రమాదం పోంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పిరిక్ స్థాయిలలో సర్క్యులేషన్ అవుతోందని, రాబోయే 4-5 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప అనంతపురం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
----
ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కల్వకుంట్ల కవిత ఖరారు అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటలో ఆమెను ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలోనే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. త్వరలో ఆమె పదవి కాలం ముగియనుండటంతో గులాబీ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. దీంతో మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమెను బరిలో దింపుతున్నారు.
----
సీఎం కేసీఆర్‌పై ఎంపీ అర్వింద్ ఘాటు విమర్శలు చేశారు. 19వ రోజు వడ్లపై క్లారిటీ ఇస్తానన్న కేసీఆర్‌కు తాగిన మత్తు దిగలేనట్లు ఉందన్నారు. కేసీఆర్ దేశాలు తిరగడానికి ప్రైవేట్ హెలికాప్టర్ కావాలా? అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో తాగి తినుడు తప్ప..వ్యవసాయం ఎన్నడు చేశారని నిలదీశారు. పనికిమాలిన సీఎం ఎవరన్నా ఉన్నారా అంటే అది కేసీఆరేనని దుయ్యబట్టారు. ఏ పంట వేయాలో చెప్తానన్న కేసీఆర్ ఎక్కడున్నారు? అని అర్వింద్ ప్రశ్నించారు.
------
ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి చేరాయని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నడిచేది లేదని, కొనేది లేదన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని తెలిపారు. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోతుందన్నారు. కొంటారో కొనరో తెలియక ధాన్యం కుప్పలపైనే.. రైతుల గుండెలు ఆగిపోతున్నా.. సీఎం కేసీఆర్ గుండె కరుగటం లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
---
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఒక్కొక్కరి ఖాతాలో నెలకు 1,000 రూపాయలు వేస్తామని పంజాబీ మహిళలకు ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలు ఇందుకు అర్హులేనని కేజ్రీవాల్ అన్నారు. సోమవారం పంజాబ్‌లోని మోగాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు