మొదట హుజురాబాద్.. చివరగా కమలాపూర్ కౌంటింగ్
posted on Nov 1, 2021 @ 9:30PM
తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన. ప్రస్తుతం ఫలితం ఉత్కంఠగా మారిన హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో లెక్కింపు ప్రక్రియను కొనసాగించనున్నారు. స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్న ఈవీఎంలను అభ్యర్థులు , ఏజెంట్ల సమక్షంలో విప్పబోతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రికార్డ్ స్థాయిలో 86 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 36 వేల మంది కాగా.. 2 లక్షల ఐదు వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం బ్యాలెట్లను 22 రౌండ్లుగా లెక్కించబోతున్నారు. ఇందుకోసం ఇక్కడ రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు . ఏడు టేబుళ్ల చొప్పున రెండు చోట్ల కలిపి 14 టేబుళ్లను సిద్ధం చేశారు . ప్రతి రౌండ్లో ఈ 14 టేబుళ్ల వద్ద ఏకకాలంలో ఓట్ల తీర్పుని బయటకు తీయనున్నారు.
ఉదయం 6 గంటలకే అభ్యర్థుల తరఫున ఏజెంట్లను లోపలికి అనుమతిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు . 8.30 నిమిషాల నుంచి ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తారు. బరిలో ఉన్న 30 మంది అభ్యర్థులకు వచ్చిన ఓట్లను వారికి టేబుల్ వారీగా నమోదు చేసి ఎన్నికల అధికారి అనుమతి పొందిన తరువాతనే రౌండ్ ఫలితాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇలా ఒక్కో రౌండ్కు ఎంతలేదన్నా 30 నిమిషాల సమయం పట్టనుంది. దీంతో తుది ఫలితం వచ్చే సరికి మాత్రం సాయంత్రం కానుంది . గత ఎన్నికలకన్నా ఎక్కువగా అభ్యర్థులుండటం వల్ల లెక్కింపు ఆలస్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.
మొదట హుజూరాబాద్ మండలంలోని 14 గ్రామాల ఓట్లను లెక్కిస్తారు. తరువాత వీణవంక , జమ్మికుంట , ఇల్లందకుంట , కమలాపూర్ మండలాల పోలింగ్ బూత్ల ఓట్లను లెక్కించనున్నారు. చివరగా కమలాపూర్ మండలంలోని గ్రామాలతో ప్రక్రియ ముగియనుంది.ఈ ఉప ఎన్నికలో.. అత్యధికంగా ధర్మరాజుపల్లిలో 95.11 శాతం (పోలింగ్ బూత్ 72లో) నమోదు కాగా.. ఇక్కడ 1,002 ఓటర్లకు గాను 953 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అత్యల్పంగా జమ్మికుంటలో 67.13 శాతం నమోదైంది.
స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణతోపాటు ఎవరిని కూడా వీటి దరిదాపుల్లోకి రానివ్వడంలేదు. వెల్లడించే ఫలితాల ప్రక్రియలో భాగంగా ప్రతి రౌండు అవసరమైన ఈవీఎం యంత్రాల్ని వీవీప్యాట్లను లెక్కింపు ప్రాంతానికి తరలించేలా ప్రతి రౌండ్కు కొంతమంది సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు చేశారు . ఇలా అధికారుల పర్యవేక్షణలో తీసుకొచ్చినవాటిని యథావిధిగా లెక్కింపు తరువాత కూడా పక్కా పర్యవేక్షణలో వాటిని భద్రపరిచేలా ఏర్పాట్లు చేశారు .