ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్.. కాబోయే శ్రీమతి ఎవరో?
posted on Dec 29, 2022 @ 2:46PM
తెలుగు సినిమా హీరోలలో ‘ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే, ఎవరికైనా వెంటనే గుర్తుకొచ్చే పేరు ... బాహుబలి ప్రభాస్.. అలాగే, రాజకీయాల్లో ‘దమోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే గుర్తు కొచ్చేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నిజమే, ప్రధాని మోడీ (పెళ్ళైన బ్రహ్మచారి), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఇలా రాజకీయ ప్రముఖులలో పెళ్లి కాని ప్రసాదులు ఇంకా కొందరున్నారు. అయినా కూడా ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’ఎవరంటే మాత్రం రాహుల్ గాంధీ పేరే ముందుగా వినిపిస్తుంది.
మిగిలిన వారందరికీ పెళ్లీడు దాటిపోయిందని కావచ్చును సోషల్ మీడియాలో రాహుల్ పెళ్లి వార్తలు వైరల్ అయినంతగా ఇతర పెళ్ళి కాని రాజకీయ ప్రముఖుల పెళ్లి వార్తలు వైరల్ అయినా దాఖలాలు లేవు. అలాగని రాహుల్ గాంధీ బాలా కుమారుడా అంటే కాదు. ఆయన ఈ మధ్యనే హాఫ్ సెంచరీ మార్క్ క్రాస్ చేశారు. ఫిఫ్టీ ప్లస్ క్లబ్ లో చేరిపోయారు. అంతేకాదు, భారత్ జోడో యాత్రలో మేకప్ లేకపోవడం వల్లనో ఏమో, నెరిసిన గడ్డం, ముడతలు పడిన ముఖంతో రాహుల్ గాంధిలో వార్ధక్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని సోషల్ మీడియాలో ఆయన కొత్త రూపం గురించిన పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు పెరిగిన గడ్డంతో రాహుల్ గాంధీ రావీద్రనాథ్ టాగోర్ లా ఉన్నారని మెచ్చుకుంటే, గిట్ట్టని వాళ్ళు సద్దాం హుస్సేన్ లా ఉన్నారని కడుపు మంట తీర్చుకున్నారు.
సరే అదెలా ఉన్నా, ఎవరు ఏమన్నా, రాహుల్ గాంధీ అంటే అమ్మాయిల్లో ఇంకా క్రేజుంది, రాహుల్ పేరుతో వైబ్రేషన్స్ ఫీలయ్యే అమ్మాయిలున్నారు. భారత్ జోడో యాత్రలో ఆయనతో కలిసి నడిచేందుకు, ఆయనతో సేల్ఫీలు దిగేందుకు అమ్మాయిలు, సెలబ్రిటీలు కూడా పోటీ పడ్డారు. అందుకే ఆయన ఇంకా, ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అలాగే, రాహుల్ గాంధీ కూడా మన ప్రభాస్ లానే పెళ్లి చేసుకోను .. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి పోతాను, అని ఆఫీషియల్ ప్రకటన ఏదీ చేయలేదు. సోలో లైఫే సో.. బెటరు అని పాడ లేదు.
అందుకే, రాహుల్ పెళ్లి గురించి అప్పుడప్పుడు... హాట్ హాట్ వదంతులు షికారు చేస్తూనే ఉన్నాయి. అయితే, ఇంతవరకు రాహుల్ గాంధీ ఎప్పడూ పెళ్లి వదంతుల మీద స్పందించలేదు. అలాగే విదేశాల్లో పబ్బుల్లో, క్లబ్బుల్లో అమ్మాయిలతో ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయినా ఆయన అంతగా పట్టించుకోలేదు. ప్రత్యర్ధి పార్టీలు శీల పరీక్ష పెట్టినా, ఆయన్ని డిఫెండ్ చేసే బాధ్యత కాంగ్రెస్ వాచాస్పతులు ( అధికార ప్రతినిధులు) ఇతర నాయకులు తీసుకున్నారే కానీ, రాహుల్ జీ ఎప్పడు కూడా తనను తాను డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ తాజాగా, సరదాగానే అయినా, మీడియా అడిగిన పెళ్లి ప్రశ్నకు రాహుల్ సరదాగా సమాధానమిచ్చారు.
తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కాబోయే భార్యకు తన నానమ్మ ఇందిరమ్మకున్న లక్షణాలు, తల్లి సోనియా గాంధీలోని సుగుణాలు... ఉండాలని మనసులోని మాటను బయట పెట్టారు. అలాగే, తనకు కాబోయే భార్య ఆ ఇద్దరిలోని మంచి లక్షణాలను కలబోసిన బొమ్మలా ఉంటే మరీ మంచిదని అన్నారు. ఇదంతా సరదగా సాగిన సంభాషనే అయినా, రాహుల్ గాంధీని ఇష్టపడే అమ్మాయిల్లో ఆ లక్షణాలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ...అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చునేమో ... ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ కాబోయే శ్రీమతి .. ఎవరో ఆ అదృష్టవతురాలు..
( ఇది కేవలం సరదా కోసం మాత్రమే ..ఎవరూ సీరియస్’ గా తీసుకోవద్దని మనవి)