ఫామ్ హౌస్ కేసులో సీఎం కేసీఆర్ పై సీబీఐ నజర్?
posted on Dec 29, 2022 @ 3:12PM
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చిక్కుల్లో పడ్డారా అంటే ఔననక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కేసీఆర్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ వ్యవహారం ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగు చూసిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను వెల్లడించడాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని పేర్కొంది.
కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను బహిరంగ పరచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో వీడియోలు విడుదల చేయడం కూడా సరికాదని స్పష్టం చేసింది. హైకోర్టు లేవనెత్తిన అంశాలు సీబీఐ చేతికి ఆయుధాలుగా మారినట్లేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మీడియా సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన సాక్ష్యాలు ఎక్కడి నుంచి, ఎవరి నుంచి వచ్చాయన్న విషయంపై సీబీఐ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. నాతిని సేయబోతే కోతి అయ్యిందన్న తీరుగా.. బీజేపీని ఇరుకున పెట్టడానికి ఫామ్ హౌస్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసి అత్యుత్సాహం ప్రదర్శించడమే ఇప్పుడు కేసీఆర్ తలకు చుట్టుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.
సీబీఐ కేసీఆర్ ను విచారించడానికి నిర్ణయించుకుంటే మాత్రం అది మరింత సంచలనం అవుతుందనడంలో సందేహం లేదు. సిట్ దర్యాప్తును రద్దు చేసి కేసును సీబీఐకి ఇవ్వడానికి పలు కారణాలను చూపిన హైకోర్టు తన తీర్పులో కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా ఆ కారణాలలో ఒకటిగా పేర్కొంది. సిట్ దర్యాప్తు పూర్తిగా రద్దు చేసినందున సీబీఐ ఈ కేసును మొదటి నుంచీ దర్యాప్తు చేయనుంది, ఫిర్యాదుదారుడైన పైలట్ రోహిత్ రెడ్డి , మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలను విచారించడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ నూ సీబీఐ ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.
దీంతో ఫామ్ హౌస్ కేసు సీబీఐ అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును తెలంగాణ సర్కార్ సుప్రీంలో సవాల్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. నువ్వు తమలపాకుతో ఒకటంటే.. నేను తలుపు చెక్కతో రెండంటా అన్న చందంగా కేసీఆర్ తన కుమార్తె కవితపై లిక్కర్ స్కాం లో కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తునకు ప్రతిగా.. బీజేపీపై ఫామ్ హౌస్ కేసులో సిట్ ను ఏర్పాటు చేశారు. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుకు కళ్లెం వేయాలని భావించారు. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టి ఫామ్ హౌస్ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లడంతో ముందరి కాళ్లకు బంధం పడినట్లైంది. కేసీఆర్ స్వయంగా సీబీఐ విచారణకు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.