తెనాలిలో ప్రయివేట్ వ్యక్తులకూ వాకీ టాకీలిచ్చిన ఎస్ ఐ
posted on Apr 18, 2020 @ 12:14PM
* ఎస్ పి కి కాకపోతే డీజీపీకి చెప్పుకో తెనాలిలో 2 టౌన్ ఎస్సై మధు పవన్ ఓవర్ యాక్షన్
గుంటూరు జిల్లా తెనాలిలో 2 టౌన్ ఎస్సై మధు పవన్ ఓవర్ యాక్షన్ చేశారు. ప్రభుత్వం నియమించిన పోలీసు సిబ్బందితో పాటు తనకు కావాల్సిన ప్రయివేటు వ్యక్తులకు పోలీసు విధులు అప్పగించారు. ప్రయివేటు వ్యక్తులకు పోలీసు లాఠీతో పాటు వాకీటాకీలను కూడా అప్పగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి ఉన్న వాహనాలను కూడా ఆ ప్రయివేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారు. ఐడీ కార్డులు చూపించినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. డీఎస్పీ ప్రోగ్రామ్‌కు వెళ్తున్న ఓ మీడియా ప్రతినిధిపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతో పాటు అతడి అక్రిడేషన్ కార్డును విసిరిపడేశారు. ‘ఇదేంటి సార్..’ అని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో పాటు ‘ఎస్పీకి కాకపోతే డీజీపీకి చెప్పుకో’ అంటూ హెచ్చరించారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ నేపథ్యంలో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది. అయితే అదే సమయంలో అత్యవసర విభాగాల వారికి అనుమతి ఇవ్వాలని కూడా పోలీసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే అవేం పట్టించుకోకుండా అంతా తన ఇష్టం అన్నట్లు తెనాలి ఎస్సై ప్రవర్తన ఉందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.