చిన్నారుల పాలిట విషం.. ఇండియన్ మేడ్ కాఫ్ సిరప్!
posted on Dec 29, 2022 @ 10:01AM
భారత్ లో తయారైన సిరప్ తాగి ఉజ్బెజిస్థాన్ లో 18 మంది చిన్నారులు మరణించారు. ఇండియాలో తయారైన డాక్ 1 మ్యాక్స్ సిరప్ ను ఎలాంటి ప్రిస్కిప్షన్ లేకుండా ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్లే చిన్నారుల మరణాలు సంభవించాయి. కాగా సిరప్‌లో కలుషిత ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు లేబరేటరీ పరీక్షల్లో వెల్లడైంది. తమ దేశంలో 18 మంది చిన్నారుల ఉసురు తీసిన పాపం ఇండియాదే అంటూ భారత్ పై మండిపడింది.
ఈ మేరకు ఓ ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ ఉన్నట్టు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. దీంతో డాక్ 1 మ్యాక్స్ ట్యాబ్లెట్లు, సిరప్ ను అన్ని మందుల షాపుల నుంచి విత్ డ్రా చేశారు. 2022లో ఇలా భారత్ లో తయారైన దగ్గు మందు సేవించి చిన్నారులు మరణించటం ఇదే మొదటి సారి కాదు. రెండోసారి. ఇంతకు ముందు గాంబియాలో 70 మంది చిన్నారులు మేడ్ ఇన్ ఇండియా కాఫ్ సిరప్ కారణంగా మరణించారు. దీనికి కారణమైన హర్యానా లోని మైడెన్ ఫార్మాను కేంద్రం సీజ్ చేసింది కూడా. ఇలా ఉండగా ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు మందు తాగి చిన్నారులు మృతి చెందడంపై తదుపరి పరిశోధనలకు సహకరించేందుకు డబ్ల్యుహెచ్ ఓ చర్యలకు ఉపక్రమించింది. ఉజ్బెకిస్థాన్‌లోని ఆరోగ్య అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. దర్యాప్తునకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.
అంతకుముందు, అక్టోబర్‌లో భారత్‌లో తయారు చేసిన దగ్గు మందు తాగి ఆఫ్రికా దేశమైన గాంబియాలో 60 మందికి పైగా పిల్లలు మరణించారు. దీని తరువాత, ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అయితే ఇప్పటి వరకు భారతీయ కంపెనీ యొక్క దగ్గు మందు నుండి పిల్లలు మరణించినట్లు అధికారిక ధృవీకరణ లేదని తెలిపింది. ఈ ఆరోపణలు అనవసరంగా భారత ఔషధ కంపెనీల ప్రతిష్టను దిగజార్చుతున్నాయని కేంద్రం చెబుతోంది. అలాగే.. భారతీయ నిర్మిత దగ్గు మందు తాగి చిన్నారులు మృతి చెందడంపై, మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్‌ల నమూనాలు నాణ్యత లేనివిగా గుర్తించినట్లు ప్రభుత్వం పార్లమెంటుకు తెలియజేసింది. కేంద్ర డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో), రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌తో కలిసి సోనెపట్‌లోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌పై సంయుక్త విచారణ జరిపిందని రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి భగవంత్ ఖుబా డిసెంబర్ 13న రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అక్టోబర్ ప్రారంభంలో దీనికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. దగ్గు మందు లో డైథలిన్ గ్లైకాల్ , ఇథిలిన్ గ్లైకాల్ మానవులకు విషం లాంటిదని అందులో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తర్వాత మైడెన్ ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులను గాంబియా నిషేధించింది. అంతే కాకుండా మందులను మార్కెట్ నుండి తొలగించాలని
ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది.