విమానంలో ముష్టిఘాతాలు, పిడిగుద్దులతో రణం.. కారణమేమిటంటే?

చదవేస్తే ఉన్న మతి పోయిందంటారు. చదువు వల్ల సంస్కారం పెరిగితేనే ఆ చదువుకు సార్థకత. ఊర్లలో బస్సులో సీట్ల కోసం పామరులు కోట్లాటలకు దిగడం సహజం. అలాగే  రైళ్లలో అన్ రిజర్వుడు కంపార్ట్ మెంట్లలో చోటు కోసం చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వారినీ చూశాం. కానీ విద్యావంతులైన యువకులు విమానంలో సీటు కోట్లాటకు దిగి కొట్టుకున్న సంఘటన  మాత్రం ఎవరూ చూసి ఉండరు.  అయినా విమనాంలో సీటు కోసం కొట్టుకోవడమేమిటి చోద్యం కాకపోతే అనుకుంటాం.  కానీ అలాంటి చోద్యం జరిగింది.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ముంబై నుంచి థాయ్ ల్యాండ్ వెళ్లేందుకు విమానం రన్ వేపై సిద్ధంగా ఉంది. ఇహనో ఇప్పుడో టేకాఫ్ తీసుకుంటుంది. సరిగ్గా ఆ సమయంలో విమానంలో గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారింది. ఇంతకీ ఆ గొడవ సీటు విషయంలో జరిగింది.

ఔను నిజమే సీటు కోసం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న విమానంలో ముగ్గురు యువకులు గొడవ పడ్డారు. జుట్టూ జుట్టూ పట్టుకు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు విసురుకున్నారు. విమాన సిబ్బంది సర్ది చెప్పడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించ లేదు.

గొడవ అంతకంతకూ తీవ్రమౌతుంటే సిబ్బంది కూడా చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు రంగ ప్రవేశం చేసిన తరువాత గొడవ సద్దుమణిగింది. వీరి గొడవ కారణంగా దాదాపు గంటన్నర ఆలస్యంగా విమానం టేకాఫ్ అయ్యింది. 

Teluguone gnews banner