తెలంగాణ సీఎస్ పదవి ఆ ఇద్దరిలో ఎవరిని వరించనుంది?
posted on Dec 31, 2019 @ 10:36AM
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు అనే విషయం పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీఎస్ పదవి కోసం సోమేష్ కుమార్ తో పాటు అజయ్ మిశ్రా ఇప్పుడు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉనప్పటికీ సోమేష్ కి అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో పరిణామాలు మారితే అజయ్ మిశ్రా ఆ పోస్టులోకి వస్తారని సమాచారం. 1984 బ్యాచ్ అధికారిగా చేసిన ఈయనకు కీలక అధికారుల మద్దతు ఉంది. అయితే 1989 బ్యాచ్ కు చెందిన సోమేష్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇద్దరి సర్వీసు కూడా పరిగణలోకి రానున్నట్టు తెలుస్తోంది. అజయ్ 2020 జులైలో రిటైరవనున్నారు, సోమేష్ కుమార్ పదవీ కాలం 2023 డిసెంబర్ వరకు ఉంది. వివాదరహితుడిగా పేరుతో పాటు సీనియార్టీ పరంగానూ ప్రస్తుత సీఎస్ శైలేంద్ర కుమార్ జోషి తరవాతి స్థానంలోఅజయ్ ఉన్నారు. ఇక సోమేశ్ ను రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించి తెలంగాణలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో కేడర్ వేరైనా సీఎం తన విచక్షణాధికారంతో సోమేశ్ ను తీసుకునే అవకాశాలున్నాయి. అయితే అజయ్ కి 7 నెలల సర్వీసే ఉన్నందున ఇప్పుడు ఆయనకు అవకాశమిచ్చి తరవాత సోమేష్ ను సీఎస్ చేయాలనే ప్రతిపాదన కూడా వస్తుంది.
ఈరోజు ( డిసెంబర్ 31న ) సాయంత్రం 5 గంటలకు జోషి పదవీ విరమణ చేయనున్నారు, ఈలోగా ఉత్తర్వులు వెలువడాల్సి వుంది. జోష్ కి మరో 3 నెలలు అవకాశమిస్తారని ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని తేలింది. మరోవైపు సోమేష్ కుమార్ బిఆర్కె భవన్ లో జోష్ పదవీ విరమణ కార్యక్రమ ఏర్పాట్లతో పాటు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. గంటన్నర పాటు సాధారణ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హాతో భేటీ అయ్యారు. జోషితో పాటు విపత్తుల నివారణ యాజమాన్యం కార్యదర్శి బూసాని వెంకటేశ్వరరావు, శాట్స్ డైరెక్టర్ దినకర్ బాబు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఒకే రోజు ముగ్గురు ఐఏఎస్ లు రిటైర్ కానుండటం ఇదే ప్రథమం. మరో 6 నెలల్లో ఐదుగురు కీలక ఐఏఎస్ లు విరమణ పొందనున్నారు.