స్టార్టింగే లక్ష జీతం... ఆర్మీలో ఉద్యోగాలు!
posted on Aug 8, 2024 @ 10:49AM
ఆర్మీలో ఉద్యోగాల పండగ మొదలైంది. మొత్తం భారీ సంఖ్యలో ఉద్యోగాలు అర్హులైన అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న యువతకు ఇండియన్ ఆర్మీ ఆహ్మానం పలుకుతోంది. షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సి) విధానంలో ఈ ఉద్యోగాలు అందుబాటులో వున్నాయి. పెళ్ళికాని యువతీ యువకులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. ఇంటర్వ్యూతో నియామకాలు వుంటాయి. శిక్షణ అనంతరం పీజీ డిప్లొమా అందుకుని, లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలో చేరిపోవచ్చు. ఆకర్షణీయమైన వేతనం, ప్రోత్సాహకాలూ పొందవచ్చు. మొదటి నెల నుంచే లక్షకు పైగా జీతంతో ఈ ఉద్యోగాలు ప్రారంభం అవుతాయి.
వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ప్రస్తుతం చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ ఖాళీలకు బీటెక్ (ఐటీ), ఎమ్మెస్సీ కంప్యూటర్ కోర్సుల వాళ్ళు కూడా అర్హులే. అభ్యర్థులు ఏప్రిల్ 1, 2025 నాటికి 20 నుంచి 27 ఏళ్ళ లోపు వయసు వున్నవాళ్ళు అయి వుండాలి. అంటే, ఏప్రిల్ 2, 1998 నుంచి ఏప్రిల్ 1, 2005 లోగా జన్మించినవాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.. ఆగస్టు 14, 2025 మధ్యాహ్నం 3 గంటల వరకు. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌ని చూడవచ్చు.