రెజ్లింగ్ కు వినేష్ పోగట్ ఇక రిటైర్మెంట్
posted on Aug 8, 2024 @ 10:41AM
పారిసి ఒలింపిక్స్‌లో ఫైనల్ పోరులో అనూహ్యంగా అనర్హత వేటు పడిన రెజ్లింగ్ భారత ఆశా కిరణం వినేష్ ఫోగాట్ మరోసారి క్రీడాభిమానులకు, దేశ ప్రజలకు షాక్ ఇచ్చే నిర్ణయం ప్రకటించింది. ఒలింపిక్స్ తరువాత రెజ్లింగ్‌కు గుడ్ బై చెబుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు స్వయంగా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
కుస్తీ నాపై గెలిచింది.. అంటూ భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ‘‘కుస్తీ నాపై గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించు. మీ కల, నా ధైర్యం విచ్ఛిన్నమయ్యాయి. నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను’’ అని ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఆమె నిర్ణయం ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురిచేసింది.
అద్వితీయ ప్రదర్శనతో పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌లోకి దూసుకెళ్లి, ఆ ఘనత సాధించిన తొలి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్ దేశానికి మరో పతకం ఖరారు చేసిందని భారత్ సంబరాలు చేసుకుంటుండగానే చేదువార్త వినాల్సి వచ్చింది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు అధికంగా ఉందన్న కారణంతో ఆమెను అనర్హురాలిగా తేల్చడంతో దేశం యావత్తు నిర్ఘాంతపోయింది. తనను అనర్హురాలిగా ప్రకటించడంపై వినేశ్ ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్’ను ఆశ్రయించింది. తాను రజత పతకానికి అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై తీర్పు రావడానికి ముందే వినేశ్ రిటైర్మెంట్ ప్రకటించి కోట్లమంది భారతీయుల హృదయాలను బరువెక్కించింది.
ఇదిలా ఉండగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో పైనల్‌లో అనర్హత వేటు పడిన అనంతరం మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కుస్తీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ స్పందించారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని వినేశ్‌కు సూచించారు. ఆమెను కలిసి మాట్లాడుతానని, ఆమెకు సర్దిచెప్పి నిర్ణయం మార్చుకునేలా చేస్తానన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ ఘటనతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అభిప్రాయపడ్డారు.ఆమె ఈ విషయాన్ని ఈ తెల్లవారుజామున 5 గంటలకు తెలియజేసిందని, ఒలింపిక్స్‌లో ఫైనల్ దగ్గరకు వచ్చి పతకాన్ని కోల్పోవడంతో ఆమె ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చునన్నారు. ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుతానన్నారు. విజయానికి ఇంత దగ్గరగా వచ్చి... ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరైనా ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నారు.