జగన్ కూతుళ్ళ కోసం 200 కోట్లు హాంఫట్!
posted on Aug 8, 2024 @ 5:10PM
తనకోసం వైజాగ్ రుషి కొండ మీద 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్న జగన్, విదేశాల్లో చదువుకుంటున్న తన ఇద్దరు కూతుళ్ళ సెక్యూరిటీ కోసం కూడా జనం సొమ్ము 200 కోట్లు తగలేశాడు. కొద్దిరోజుల క్రితమే అత్యంత పకడ్బందీగా చట్టాన్ని తయారు చేసి అమలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వారి భార్య లేదా భర్త.. వారి పిల్లలు, ముఖ్యమంత్రితోపాటు అతని జీవిత భాగస్వామి తల్లిదండ్రులు... వీళ్ళందరూ ఎక్కడ వున్నా... చివరకు విదేశాలలో వున్నా ఈ చట్ట ప్రకారం భద్రత ఇవ్వాలి. ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సమీపం నుంచి భద్రత (ప్రాక్స్ మేట్ సెక్యూరిటీ) కల్పించేందుకు వీలుగా ప్రత్యేక భద్రతా గ్రూపు (ఎస్.ఎస్.ఏ.) బిల్లును జగన్ కొద్దికాలం క్రితమే ఆమోదింపచేసుకున్నాడు. ఇది కేవలం విదేశాల్లో చదువుకుంటున్న తన కూతుళ్ళను దృష్టిలో పెట్టుకుని ఆమోదింపచేసుకున్న ‘సొంత’ బిల్లు. ఈ బిల్లు ప్రకారం, విదేశాలలో చదువుకుంటున్న జగన్ కూతుళ్ళ కోసం జనం సొమ్ము దాదాపు రెండు వందల కోట్లు ఖర్చుపెట్టారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి కుటుంబానికి అవసరమైన భద్రతపరమైన సేవలు అందించేందుకు ఎస్.ఎస్.ఎ.లోని సభ్యులు కట్టుబడి ఉండాలని బిల్లులో పేర్కొన్నారు. "ముఖ్యమంత్రి, వారి భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు ఇంట్లోనూ, ప్రయాణ సమయంలోనూ, ఎక్కడైనా బస చేసినప్పుడు, ఎక్కడికైనా వెళ్లినప్పుడు, వేడుకలు, కార్యక్రమాలకు హాజరైనప్పుడు ఇలా అన్ని సందర్భాలలోనూ ఎస్.ఎస్.ఎ. రక్షణ కల్పిస్తుంది. వాహనాల్లో, రైల్లో, విమానాల్లో, నౌకల్లో ప్రయాణించినప్పుడు, కాలినడకన వెళ్లినప్పుడు కూడా ఈ ప్రత్యేక బృందం వారి వెన్నంటే ఉంటూ వారి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భద్రతాపరంగా అవసరమైన కట్టడి నిబంధనలనూ అమలు చేస్తుంది. వారి సమీపంలోకి ఎవరైనా రావాలన్నా నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం ఈ ప్రత్యేక భద్రతా గ్రూపు (ఎస్.ఎస్.ఎ) ఈ బాధ్యతలను చూస్తుంది. దీనిలో పనిచేయటానికి పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లోని సిబ్బందిని డిప్యుటేషన్ ప్రాతిపదికన తీసుకుంటారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. ఎస్ఎస్ జీ గ్రూపులోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ (లీగల్ ఇమ్యూనిటీ) ఉంటుంది" అని జగన్ ప్రభుత్వం ఆ బిల్లులో పొందుపరిచింది. ఆ బిల్లు ప్రకారం విదేశాల్లో వున్న జగన్ కుమార్తెలకు భారీ స్థాయిలో భద్రత అందినట్టు తెలుస్తోంది.