రేవంత్ రెడ్డి వాట్ నెక్స్ట్ ?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారా? కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో అయితే, రేవంత్ ఇప్పటికే,  తెలంగాణ సామాజిక కాంగ్రెస్  పేరున ఈసీ వద్ద పార్టీని రిజిస్టర్ చేయించారనే వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. మరో వంక రేవంత్ రెడ్డి అనుచరులు అలాంటిది ఏమీ లేదని ఎంతగా మొత్తుకున్నా, ఫలితం కనిపిచడం లేదు.

అంతే కాదు  నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలోని ఆయన ప్రత్యర్ధులు  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిందే, హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు చేసేందుకనే, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ ప్రచారం ఇప్పడు కాదు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో, రాజకీయ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తూనే వుంది. ఇప్పడు మరింత అదే ప్రచారం మరింత జోరు అందుకుంది. ఈ అన్నిటినీ మించి సోషల్ మీడియాలో రేవంత్ సొంత పార్టీపై ఇంత చర్చ  రచ్చ జరుగుతున్నా ఆయన నేరుగా  స్పందించక పోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.  

అదలా ఉంటే రేవంత్ రెడ్డిని డే వన్ నుంచి వ్యతిరేకిస్తున్న  కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రేవంత్ రెడ్డి కొత్త పార్టీకి సంబందించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అంత తేలికగ్గా తీసుకోరాదని అంటున్నారు. అలాగే, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై రేవంత్ స్పందించాలని అన్నారు. అయోమయంలో కొట్టు మిత్తడుతున్న పార్టీ క్యాడర్ కు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌ను మార్చి వేరే వారిని ఇంచార్జిగా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ వచ్చి సీనియర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ ఢిల్లీ అధిష్టానానికి ఎలాంటి నివేదిక సమర్పిస్తారనేది చూడాలి. ఆయన నివేదికతో అధిష్టానం మంచి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని వీహెచ్ పేర్కొన్నారు.

మరో వంక రేవంత్ కొత్త పార్టీ ఏర్పాటు అంశాన్ని కాంగ్రెస్ ఖండించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్‌ స్రైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తున్న వ్యక్తుల వివరాలను ఏసీపీకి అందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవంక  నిప్పు లేనిదే పొగరాదని కొందరు కాంగ్రెస్ నాయకులే  వ్యాఖ్యానిస్తున్నారు. 

అదలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డి తనంతట తాను  వెళ్ళిపోతే తప్పించి ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేంది లేదని సీనియర్ నాయకులకు స్పష్టం చేసిందని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినవస్తోందని అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ, జాతీయ స్థాయిలో, అసమ్మతి గళం వినిపించిన ‘జీ 23’ నేతల విషయంలో వ్యవహరించిన రీతిలోనే కఠినంగా ఉండాలని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సూచించినట్లు సమాచారం. నిజానికి, రాహుల్ గాంధీ మొదటి నుంచి కూడా,  ఉన్నవాళ్ళు ఉంటారు .. పోయిన వాళ్ళు పోతారు  అనే స్టాండ్ మీదనే నిలిచారు. ముఖ్యంగా సీనియర్ నాయకుల బెదిరింపులకు లొంగేది లేదని ఇప్పటికే రాహుల్ గాంధీ పలు సందర్భాలలో స్పష్టం చేశారు. తెలంగాణ సీనియర్ల విషయంలోనూ  రాహుల్ గాంధీ అదే మాట మీదన్నారని అంటున్నారు. 

నిజానికి రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసినప్పటి నుంచి సీనియర్ల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా రాహుల్ గాంధీ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డిని మార్చేది లేదని అనేక మార్లు సీనియర్  నాయకులకు స్పష్టం చేశారని రేవంత్ వర్గం నాయకులు అంటున్నారు. రేవంత్ రెడ్డితో సీనియర్లకు విభేదాలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ రాహుల్ గాంధీ పార్టీ నాయకులను ఢిల్లీ పిలిపించుకుని  కాంగ్రస్ లో ఉండాలంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయక తప్పదని స్పష్తం చేశారని అంటారు. 

ఆ ధీమాతోనే రేవంత్ రెడ్డి బండకేసి కొడతా,  నేను ఐపీఎస్ .. మీరు హోం గార్డులు వంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులలో రేవంత్ రెడ్డి  పీసీసీ అధ్యక్ష పదవి కంటే  తమ రాజాకీయ భవిష్యత్ గురించి ఎక్కువ అలోచిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే ఏమిటి? బయటకు వచ్చి వేరే పార్టీలో చేరడమో, సొంత పార్టీ  పెట్టడమో చేస్తే ఏమిటి? అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. అందుకే, సోషల్ మీడియాలో జరుగుతున్న, ‘రేవంత్  సొంత పార్టీ’ ప్రచారంపై ఆయన నేరుగా స్పందించడం లేదని అంటున్నారు.  ఏమో రేవంత్ మనసులో ఏముందో .. అది ఆయనే చెప్పాలి ..అంతవరకు ‘రేవంత్  సొంత పార్టీ’  డైలీ సీరియల్’ లెక్క నడుస్తూనే ఉంటుదని అంటున్నారు.