కేంద్రంలో అధికారం ఎవరిది? దక్షిణాది రాష్ట్రాల తీర్పే కీలకం!
posted on Mar 6, 2024 @ 10:13AM
సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాదికి ఇప్పటి వరకూ పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపించదు. ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ లోక్ సభలో అత్యధిక స్థానాలు ఉన్న పార్టీగా అవతరించి దాదాపుగా విపక్ష పాత్ర పోషించింది. అయితే అప్పుడు ఉన్నది ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర విభజన తరువాత అవి రెండు రాష్ట్రాల మధ్యా విడిపోయాయి. తెలంగాణలో 17, ఏపీలో పాతిక అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత తగ్గింది. ఇక దక్షిణాది విషయానికి వస్తే ఇక్కడ చాలా వరకూ ప్రాంతీయ పార్టీల హవా ఉండటంతో సార్వత్రిక ఎన్నికలలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. కానీ ఈ సారి అలా కాదు... ఉత్తరాదిన కాంగ్రెస్ బలహీన పడటం, అదే సమయంలో దక్షిణాదిన పుంజుకుంటూ వస్తున్న సంకేతాలు స్పష్టంగా గోచరిస్తున్న నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.
కాంగ్రెస్ ముక్త భారత్ అంటున్న బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ సాధిస్తున్న పట్టును దెబ్బతీయడం ప్రధాన టార్గెట్ గా మారింది. అదే సమయంలో దక్షిణాదిలో పార్టీ బలహీనతను దక్షిణాదిలో అత్యధిక స్థానాలలో విజయం సాధించడం ద్వారా భర్తీ చేసుకుని కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవడానికి భాగస్వామ్య పక్షాలను ఆకర్షించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. దీంతో సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలలో ఏ పార్టీకి ఎక్కువ ఆదరణ ఉంటుందన్నదానిపైనే కేంద్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏదన్నది తేలే అవకాశాలున్నాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
అందుకే తనకు పట్టు ఉన్న దక్షిణాదిపై సహజంగానే కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారిస్తే.. కాంగ్రెస్ ముక్త భారత్ ను సాకారం చేయలేకపోయినా.. దక్షిణాదిలో ఆ పార్టీ మరింత బలోపేతం కాకుండా చూడటమే లక్ష్యంగా బీజేపీ కూడా ఈ సారి దక్షిణాది రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. వాస్తవానికి దక్షిణాదిలో బీజేపీకి కర్నాటకను మినహాయిస్తే చెప్పుకోదగ్గ స్టేక్ లేదు. కేరళ, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేంద్ర పాలత ప్రాంతం పుదుచ్చేరిలలో ఆ పార్టీ ఉనికి, ఓటు కూడా నామమాత్రమే. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఏదో మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా.. అధికారంలోకి వచ్చేంత బలం కానీ ఓటు కానీ ఆ పార్టీకి లేదు. ఆయా రాష్ట్రాలలో పొత్తుల ద్వారా ఏవో కొన్ని స్థానాలకు పరిమితమౌతూ వచ్చింది. అటువంటి బీజేపీ ఇప్పుడు తెలంగాణలో ఒంటరి పోరు ద్వారా చెప్పుకోదగ్గ లోక్ సభ స్థానాలను గెలుచుకోగలమన్న ధీమాతో ఉంది. తమిళనాడులో కూడా జయలలిత మరణం తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ప్రయత్నాలు చేస్తున్నది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దూకుడుతో అక్కడ కొద్ది మేరకు బలపడినట్లు కనిపిస్తున్నా, సార్వత్రిక ఎన్నికలలో ఆ పార్టీ పెర్ఫార్మెన్స్ ను చూసిన తరువాతే అక్కడ కమల వికాసం ఏలా ఉందో చెప్పగలం.
ఇక ఏపీలో బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సొంతంగా బలోపేతం అవ్వడం సంగతి అటుంచి పొత్తు కుదుర్చుకున్నా భాగస్వామ్య పార్టీల నుంచి ఓటు ట్రాన్స్ ఫర్ అవ్వడం అనుమానమేనని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. ఇక కేరళలో ఇప్పటికీ వామపక్ష ఆధిపత్యమే కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కర్నాటక మాత్రమే. ఆ రాష్ట్రంలో మాత్రమే బీజేపీ సార్వత్రిక ఎన్నికలలో డబుల్ డిజిట్ స్థానాలు దక్కించుకోగలనన్న విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ కు దక్షిణాదిలో పెరుగుతున్న పట్టుకు చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఈసారి సార్వత్రిక ఎన్నికలలో దక్షిణాది రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ పెరిగింది. అందరి దృష్టీ ఈ రాష్ట్రాలపైకి మళ్లింది. ప్రతి రాష్ట్రం నుంచీ లోక్ సభలో కనీస ప్రాతినిథ్యం అన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. మరి దక్షిణాది ఓటర్లు ఏం తీర్పు ఇస్తారన్నది వేచి చూడాల్సిందే.