ఏపీలో కమలం పాత్రపై కన్ఫ్యూజన్.. వ్యూహాత్మకమేనా?
posted on Mar 6, 2024 9:15AM
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన కూటమి పొత్తు విషయంలో కమలనాథుల కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఓ వైపు కూటమిలోని జనసేన తమ మిత్రపక్షమని గట్టిగా చెబుతూనే, పొత్తు విషయంలో ఎటూ తేల్చకుండా నాన్చడం ద్వారా ఏపీలో తన పాత్ర ఏమిటో? ఎలా ఉండాలని భావిస్తోందో తేల్చుకోలేని అయోమయ పరిస్థితుల్లో బీజేపీ ఉంది. జనసేనాని పవన్ కల్యాణ్ అయితే ఏపీలో తెలుగుదేశంతో కలిసే తన ప్రయాణం అని కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించేయడమే కాకుండా, ఆ పార్టీతో కలిసి సీట్ల ప్రకటన కూడా చేసేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయనుందని ప్రకటించడమే కాకుండా కొన్ని స్థానాలలో అభ్యర్థులను కూడా ప్రకటించేశారు.
అలాగే తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల ప్రకటన చేసేసింది. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీకి తలుపులు తెరిచే ఉంచింది. మరో వైపు బీజేపీ కీలక నేత, కేంద్ర హోమంత్రి అమిత్ షా ఎన్డీయేలో పాత మిత్రులు కలుస్తున్నారంటూ ప్రకటించి, తెలుగుదేశం పార్టీ ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయన్న హింట్ ఇచ్చారు. ఇది జరిగి పది రోజులు దాటిపోయింది. అయినా ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటన్న విషయంలో ఎటువంటి క్లారిటీ లేదు. ఏపీ బీజేపీలో మెజారిటీ నేతలు మాత్రం తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసివెడితేనే మేలని భావిస్తున్నారు. ఆ కూటమితో కలిసి వెడితే ఏపీ అసెంబ్లీలో కొన్ని స్థానాలు, అలాగే ఏపీ నుంచి పార్లమెంటుకు ఒకటి రెండు స్థానాలు సాధించుకోవచ్చని గట్టిగా నమ్ముతున్నారు.
గత ఎన్నికలలో ఏపీ అసెంబ్లీలో బీజేపీకి అసలు ప్రాతినిథ్యమే లేని సంగతి తెలసిందే. గత ఎన్నికలలో బీజేపీకి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. ప్రస్తుతం ఒంటరిగా బరిలోకి దిగినా అదే పరిస్థితి పునరావృతం అవుతుందనీ, పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చే అవకాశాలు కూడా లేవనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే చివరి నిముషంలో బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితోనే కలిసివేడుతుందని కూడా అంటున్నారు. ఆ కారణంగానే పొత్తు విషయంలో ఏపీ బీజేపీ నేతలెవరినీ నోరు మెదపవద్దని ఆ పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయనీ చెబుతున్నారు.
ఎన్నికలకు సంబంధించి ఏపీలో బీజేపీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రిపరేషన్స్ చేపట్టకపోవడమే ఇందుకు నిదర్శనమని కూడా చెబుతున్నారు. పై స్థాయిలో తెలుగుదేశం, జనసేన కూటమితో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయనీ, ఇప్పటికే అవి ఒక కొలిక్కి వచ్చాయనీ రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయించాలి? ఎన్ని లోక్ సభ స్థానాలలో బీజేపీ పోటీ చేస్తుంది అన్న విషయాలపై ఇప్పటికే మూడు పార్టీల నేతలకూ ఒక ఒప్పందం కుదిరిందని కూడా చెబుతున్నారు. రానున్న రోజులలో ఈ మేరకు ప్రకటన వెలువడుతుందంటున్నారు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమి సమష్టిగా జనంలోకి వెళ్లడంతో బీజేపీకి ఈ కూటమితో కలిసి వెళ్లడం వల్ల ప్రచార అజెండా, మేనిఫెస్టో వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండా పోయిందనీ, బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం వల్ల తమ ప్రచారం కూడా ఆ పార్టలే చేస్తాయనీ కమలం పెద్దలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగుదేశం, జనసేన కూటమి జగన్ పాలనలో గాడితప్పిన ఏపీని దారిలో పెట్టే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్ని ప్రజలకు విస్పష్ట హామీ ఇచ్చేశారు. సో స్థానిక అంశాలపై బీజేపీకి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇక జాతీయ అంశాలు, ఏపీని కేంద్రం ఆదుకోవడం వంటి అంశాలపై స్థానిక బీజేపీ నేతలు మాట్లాడడానికి ఏమీ లేదు. ఆ విషయాలన్నీ మోడీ చూసుకుంటారు. సో ఏపీ ఎన్నికలలో రాష్ట్ర బీజేపీని మౌనంగా ఉంచే వ్యూహంతోనే పొత్తు ప్రకటనలో జాప్యం జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.