ప్రాంతాల మధ్య చిచ్చు.. జగన్ కొత్త వ్యూహం.. విశాఖ నుంచే ప్రమాణం ప్రకటన అందుకేనా?
posted on Mar 6, 2024 @ 10:52AM
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జనసేన కూటమి ప్రజల్లోకి దూసుకెళ్తోంది. వీరి కలయిక సక్సెస్ కావడంతో జగన్ శిబిరంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. తెలుగుదేశం, జనసేన కార్యకర్తల్లో చిచ్చుపెట్టేందుకు వైసీపీ వ్యూహకర్తలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల విషయంలో పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తూ.. జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టేలా వైసీపీ కోవర్టులు, కాపు సంఘం పెద్దలు చేసిన ప్రయత్నాలను సైతం పవన్, చంద్రబాబు చాలా చాలా బలంగా తిప్పికొట్టారు. వైసీపీ వ్యూహకర్తలు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో ఓటమి ఖాయమని జగన్ సహా వైసీపీ పెద్దలకు క్లియర్ కట్ గా అర్ధమైపోయింది.
జగన్ సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ మళ్లీ అధికారం అసాధ్యమని తేలిపోయింది. దీంతో జగన్ కొత్త నాటకానికి తెరలేపారు. ప్రాంతాల వారిగా వైసీపీ బలాబలాలను విశ్లేషించుకున్న జగన్ పోలింగ్ సమయం నాటికి విశాఖ వర్సెస్ అమరావతి అనే అంశాన్ని ప్రజల్లో రెచ్చగొట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగానే ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోని విశాఖ రాజధాని అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లుండి తెరపైకి తెచ్చారు. అంతేకాదు.. తాను మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని విశాఖ వేదికగా చెప్పారు. దీని ద్వారా విశాఖపట్టణంతోపాటు చుట్టు పక్కల జిల్లాల ప్రజలను తమవైపుకు తిప్పుకొవచ్చన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపాధిలేక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్న పరిస్థితి. దీంతో గతం ఎన్నికల్లో ఓట్లేసి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఏపీ ప్రజల్లో వ్యతిరేకతతో పాటు.. అగ్నికి అజ్యం తోడైనట్లు తెలుగుదేశం, జనసేన పొత్తుగా ఎన్నికలో బరిలోకి దిగుతుండటం, మరోవైపు కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీ సైతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమితో కలిసినడిచేందుకు సిద్ధమవుతుండటంతో జగన్ లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ.. భారీ స్థాయిలో ఓటమిని చవిచూడకుండా జగన్ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రాజధాని అంశాన్ని ఉన్నట్లుండి తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏపీని రాజకీయంగా మూడు ప్రాంతాలుగా తీసుకుంటే.. సౌత్ కోస్టల్ ఆంధ్రాలో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాలు, నార్త్ కోస్టల్ ఆంధ్రా విశాఖ, విజయనగరం, శ్రీకాళం ఉమ్మడి జిల్లాలు.. గ్రేటర్ రాయలసీమ పరిధిలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూల్ ఉమ్మడి జిల్లాలు ఉంటాయి. వైసీపీ వ్యూహకర్తల అంచనా ప్రకారం.. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరితో గుంటూరు, కృష్ణా ఉమ్మడి జిల్లాల ప్రజలు జగన్ అన్నా జగన్ పార్టీ అన్నా మండిపడుతున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడటంతో ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు తోడు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ కూటమిదే తిరుగులేని ఆధిపత్యం అని సర్వేలు సందేహాలకతీతంగా తేల్చేశాయి. రాయలసీమలోని ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితిని పరిశీలిస్తే, ఆ జిల్లాలలో తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీల మధ్య హోరాహోరీ తప్పదని పేర్కొన్నాయి. ఇక ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ తెలుగుదేశం, జనసేన కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. సొంత సర్వేలే పార్టీ గెలిచే అవకాశాలు లేవని తేల్చేయడంతో జగన్ వ్యూహాత్మకంగానే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలపై దృష్టిసారించారు. అందుకే మరోసారి విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అమరావతి రాజధాని విషయంలో పార్టీ స్టాండ్ ప్రకారం, మరోవైపు తెలుగుదేశం, జనసేన పొత్తు కారణంగా ఎన్నిప్రయత్నాలు చేసినా గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అదనంగా వచ్చే ఓటు బ్యాంకు ఏమీ ఉండదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. రాయలసీమపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. ఆ ప్రాంతంలో గతంకంటే సీట్లు తగ్గినా మెజార్టీ సీట్లు సాధించేలా వైసీపీ అడుగులు వేస్తోంది. ఇక విశాఖ, దాని పరిధిలోని జిల్లాల్లో పట్టు సాధించేందుకు సీఎం జగన్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. విశాఖ రాజధాని అని మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం చెబుతున్నా ఆ ప్రాంత ప్రజలు అంతగా స్పందించడం లేదు. స్పందన ఏంటి అసలు జగన్ మాట నమ్మడం లేదు. విశాఖ నుంచే పాలన అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెట్టి మిన్నకుండటంతో జగన్ మాటల మీద ఉత్తరాంధ్ర జనాలకు నమ్మకం పోయింది. దీంతో జగన్ ఇప్పుడు విశాఖ వర్సెస్ అమరావతి అనే నినాదాన్ని తెరపైకి తెచ్చి రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలన్న వ్యూహానికి తెరతీశారు. తద్వారా విశాఖ, దాని పరిసర ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. ఎటూ రాయలసీమలో తనకున్న పట్టు ద్వారా అధిక స్థానాలు సొంతం చేసుకోలనన్న నమ్మకం జగన్ లో ఉంది. జగన్ అధికారంలోకి వచ్చేందుకు ఎంతకైనా తెగిస్తారనేది ఏపీ ప్రజలకు తెలిసిన విషయమే. ఈసారి ఎన్నికల్లో జగన్ రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే జగన్ ఉన్నట్లుంటి విశాఖనే ఏపీ రాజధాని, వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అంటూ వ్యాఖ్యానించాడని పరిశీలకులు పేర్కొంటున్నారు.