రేవంతే తెలంగాణ ముఖ్యమంత్రి.. వెలువడిన అధికారిక ప్రకటన
posted on Dec 5, 2023 @ 5:50PM
ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు తెరపడింది. కొద్ది సేపటి కిందట ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినే పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందని ప్రకటించారు. అంతకు ముందు రోజంగా తెలంగాణ సీఎం విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హస్తినలో హై డ్రామా నడిచింది.
సీఎం పదవి రేసులో ఉన్న మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తినలో పార్టీ పెద్దలతో వరుస భేటీలు జరిపారు. మధ్యలో ఏఐసీసీ సమావేశంలో తెలంగాణ సీఎం విషయమై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ అని ఒక్క ముక్కలో తేల్చేసినట్లు సమాచారం. ఆ సమావేశం పూర్తయిన తరువాత డీకే శివకుమార్ సీల్డ్ కవర్ లో సీఎం అభ్యర్థి పేరుతో హైదరాబాద్ బయలుదేరనున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ లోగా సీన్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నివాసానికి మారింది. ఆయన నివాసంలో డీకే, మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు 40 నిముషాల సేపు చర్చ జరిగింది. ఆ సమావేశం ముగియగానే బయటకు వచ్చిన మల్లు, ఉత్తమ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఆ తరువాత కొద్ది సేపటికే వేణుగోపాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సీఎంగా రేవంత్ ను అధిష్ఠానం ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కాగా ఉదయం నుంచీ ఎల్లా హోటల్ లోనే మకాం వేసి ప్రభుత్వ ఏర్పాటు, తరువాత తీసుకోవలసిన చర్యలపై నేతలతో చర్చిస్తూ ఉన్న రేవంత్ హైకమాండ్ పిలుపు మేరకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరారు. ఉదయ నుంచే తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ పేరు ఖరారు చేసినట్లు పలు మీడియా సంస్థలు చెబుతూ వస్తున్నాయి. అలాగే హస్తినలో జరుగుతున్న చర్చ అంతా మంత్రివర్గ కూర్పుగురించేనని పేర్కొన్నాయి. చివరకు హైకమాండ్ మంగళవారం (డిసెంబర్ 5) సాయంత్రం ఆరున్నర గంటల తరువాత రేవంత్ పేరును ప్రకటించడంతో ఉదయం నుంచీ కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ శ్రేణులలో సంబరాలు అంబరాన్నంటాయి.
హస్తినలో హై కమాండ్ రేవంత్ తో మంత్రివర్గ కూర్పుపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకు ముందు ఏఐసీసీ సమావేశం ముగిసిన తరువాత అధిష్టానం నిర్ణయానికి కట్లుబడి ఉంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చెప్పారు. సీఎం రేసులో తాను ఉన్నాననీ, అయినా అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తాననీ పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెైస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రేవంత్ నే పార్టీ అధిష్ఠానం సీఎంగా ఎంపిక చేసే అవకాశం ఉందని తొలి నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది.
మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (డిసెంబర్ 6) లోగా తెలంగాణ సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. అలాగే అందరూ ఊహించినట్లుగానే రేవంత్ నే కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం గా ప్రకటించింది. దీంతో సోమవారం (డిసెంబర్ 4) నుంచి కొనసాగుతున్న సీఎం ఎంపిక ప్రక్రియ ముగిసింది. హైదరాబాద్‌లోని ఎల్జా హోటల్‌లో డి. శివకుమార్‌తో పాటు ఇతర పరిశీలకులు సోమవారం (డిసెంబర్ 4) ఎమ్యెల్యేలతో విడివిడిగా కూడా మాట్లాడారు. ఆ తార్వత తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక ప్రక్రియకి హస్తినకు అంటే పార్టీ హైకమాండ్ కోర్టుకు చేరింది. హస్తినలో కూడా సుదీర్ఘ చర్చల అనంతరం తెలంగాణ సీఎంగా రేవంత్ ను ఖరారు చేస్తూ ప్రకటన వెలువడింది.