దేశంలో 40 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు.. అక్టోబర్ లో థర్డ్ వేవ్ కల్లోలమేనా?
posted on Jun 23, 2021 @ 3:40PM
దేశంలో మరణ మృదంగం మోగించిన కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే క్రమంగా తగ్గుతోంది. మే నెలల్లో గరిష్టంగా ఒక్క రోజులే నాలుగు లక్షలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 50 వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయి. సెకండ్ వేవ్ ఉధృతి తగ్గిందని సంతోషపడుతుండగానే మరో పిడుగు లాంటి వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో త్వరలోనే కొవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ, జాతీయ వైద్య సంస్థలతో పాటు ఎయిమ్స్ డైరెక్టర్ కూడా ఇదే విషయం చెబుతున్నారు. అక్టోబర్ వరకు థర్డ్ వేవ్ తప్పకుండా వస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజాగా దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ రావడం తప్పదని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తేల్చి చెప్పారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య దేశంలో థర్డ్ వేవ్ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వారు అంచనా వేశారు. దేశంలో జులై 15వ తేదీ వరకు అన్‌లాక్ ప్రక్రియ కొనసాగితే మూడో దశ గరిష్ఠాన్ని తాకే అవకాశంపై మూడు విభాగాలుగా అంచనా వేసినట్టు ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ రాజేశ్ రంజన్ తెలిపారు. తిరిగి యథాస్థితికి రావడం, ఉత్పరివర్తనాల ప్రభావం, కొవిడ్ నిబంధనలు పాటిస్తే కొవిడ్ ప్రభావం తగ్గడం వంటి అంశాలను అధ్యయనం సందర్భంగా పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు.
అక్టోబరులో మూడో దశ గరిష్ఠానికి చేరుకున్నప్పటికీ రెండో దశతో పోలిస్తే దీని తీవ్రత తక్కువగా ఉంటుందన్నది ఇందులో మొదటిది. వైరస్ వ్యాప్తి రెండో దశ గరిష్ఠం కన్నా ఎక్కువగా ఉంటే అది సెప్టెంబరు నాటికే కనిపించొచ్చన్నది రెండోది. ఈ దశలో ఉత్పరివర్తనాల ప్రభావం తక్కువగా ఉంటుందని తేల్చారు. నిబంధనలు పాటిస్తే కరోనా వైరస్ ప్రభావం తగ్గడం మూడోది. భౌతిక దూరంతోపాటు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తే కొవిడ్ గరిష్ఠస్థాయి అక్టోబరు చివరి వరకు ఆలస్యం కావొచ్చని నిపుణులు అంచనా వేశారు.
ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, మణిపూర్, సిక్కిం మినహా దేశంలో రెండోదశ పూర్తిగా క్షీణించిందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రాజేశ్ రంజన్, మహేంద్రవర్మ తెలిపారు. దేశంలో ప్రస్తుతం కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు పది శాతానికిపైగా ఉండగా, చాలా రాష్ట్రాల్లో ఐదు శాతం తక్కువగా ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను పరిగణనలోకి తీసుకుని నిర్వహించిన మరో అధ్యయన వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఐఐటీ కాన్పూర్ నిపుణులు చెప్పారు.
మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలలో 40 కి పైగా డెల్టా వేరియంట్ ప్లస్ కేసులు నమోదు అయ్యాయి. ఎనిమిది రాష్ట్రాల్లో ఈ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 22 కేసులు, మధ్యప్రదేశ్ లో ఆరు కేసులు, కేరళలో రెండు కేసులు, ఆంధ్ర ప్రదేశ్ , పంజాబ్, జమ్ము రాష్ట్రాలలో ఒక్క కేసు నమోదైంది. డెల్టా ప్లస్ వేరియంట్ కు సంబంధించి మంగళవారం నాలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం.. తాజాగా బుధవారం ఏపీ సహా మరో నాలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది, అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ సడలింపు ఇస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా మరోసారి అప్రమత్తం చేసింది కేంద్రం.