నీ కుట్రలు సాగవు బిడ్డా.. కేసీఆర్ కు ఈటల డైరెక్ట్ వార్నింగ్!
posted on Jun 23, 2021 @ 3:07PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై డైరెక్ట్ వార్ ప్రకటించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గులాబీ బాస్ టార్గెట్ గా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ కేసీఆర్ అని రాజేందర్ మండిపడ్డారు. ఒడ్డు ఎక్కేదాక ఓడమల్లన్న.. ఒడ్డు ఎక్కిన తరువాత బోడ మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తారని ఆరోపించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే మనిషి కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఎన్నికలకు వస్తారన్నారు.
‘‘నేను ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెళుతున్నా. కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడు. తెనేపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజూరాబాద్ ప్రజలు సహించరు. నువ్వు కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలవవచ్చు. కోట్లు కుమ్మరించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ గెలవచ్చు. కానీ హుజూరాబాద్‌లో నీ కుట్రలు సాగవు బిడ్డా’’ అంటూ ఫైర్ అయ్యారు.
హుజురాబాద్ లో కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, రేషన్ కార్డులు, ఫించన్లు మంజూరవుతున్నాయని సోషల్ మీడియాలో చూసా.. అన్ని నియోజకవర్గాల్లో కూడా మా ఎమెల్యే రాజీనామా చేస్తే బాగుండనని, ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండనని జనం అనుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఈటల అన్నారు. ఇటీవల జరిగిన సభల్లో కేసీఆర్ మాటలు వింటే ధర్మానికి ప్రతిరూపమని, మాట తప్పని మనిషని అందరూ అనుకుంటారు.. కానీ ఆయన అసలు రంగు వేరే ఉందన్నారు. గొప్ప నేతలు, పార్టీలు ప్రజల్ని నమ్ముకుంటారని.. కేసీఆర్ మాత్రం డబ్బులు, కుట్రలు, మోసాన్ని నమ్ముకుంటారని రాజేందర్ మండిపడ్డారు. ఈ కుట్రలను చరమగీతం హుజురాబాద్ నియోజకవర్గం చరమగీతం పాడబోతోందన్నారు. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ లో గెలవచ్చు.. కాని హుజురాబాద్ లో మాత్రం ధర్మం మాత్రమే గెలుస్తుందన్నారు.
2006లో కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు టీఆర్ఎస్ కు ఏ ప్రజాప్రతినిధుల బలం లేకున్నా, అవతలి పార్టీలు కోట్ల డబ్బులు ఖర్చు చేసినా ఉద్యమకారుల అండతో గెలిపించామని చెప్పారు ఈటల.
తెలంగాణ ఉద్యమంలో పోలీసులు, ఉద్యమకారులు పోలింగ్ బూతుల దగ్గర కాపలాగా ఉన్నారన్నారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో తన విజయాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఈటల చెప్పారు.
హుజురాబాద్ లో గెలిచి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపిస్తానని తెలిపారు
ఎస్సీలు, బీసీలు ఉపాధి కోసం లోన్లకు వెళ్తే సర్కారు ఇవ్వడం లేదు.. కానీ ఆదాయంపన్ను కట్టేవాళ్లకు మాత్రం లోన్లు ఇస్తోందని ఈటల విమర్శించారు. వందల ఎకరాలు భూములన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు ఎలా ఇస్తారని మాత్రమే అడిగానని చెప్పారు. తాను ఆరుసార్లు గెలిచినా ఏనాడు ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వలేదని.. మద్యం, బ్రాండీషాపు గురించి తెలియదని చెప్పారు.
ఒక్క రోజు మీకు ప్రలోభ పెట్టే నాయకుడు కావాలా, 365 రోజులు పనిచేసే నాయకుడు కావాలా అని ప్రజలను ఓట్లు అడిగానని తెలిపారు.