కంచుకోటలో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? డబ్బా? ఉత్తమ్ పై వ్యతిరేకతా?
posted on Oct 25, 2019 @ 11:00AM
కంచుకోట హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై పార్టీ లీడర్లలో అంతర్మథనం మొదలైంది. ఉత్తమ్ కు మంచి పట్టున్న హుజూర్ నగర్ లో సైతం ఓడిపోవడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. తక్కువ మెజారిటీతోనైనా గెలవాల్సిన స్థానంలో ఎలా ఓడిపోయామంటూ చర్చించుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో టీఆర్ఎస్ కు అంత భారీ మెజారిటీ ఎలా వచ్చిందంటూ పోస్టుమార్టం మొదలుపెట్టారు. అయితే, అభ్యర్ధి ఎంపికపై చెలరేగిన రగడ ఒక కారణమైతే, పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం, అలాగే వ్యూహరచనలో వ్యూహాత్మక తప్పిదాలే కారణమని భావిస్తున్నారు. ఇక, అధికార పార్టీ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకుని మొత్తం గులాబీ యంత్రాంగానే రంగంలోకి దించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తే... కాంగ్రెస్ నేతలు మాత్రం పోల్ మేనేజ్ మెంట్ లో ఘోరంగా విఫలమైందని అంటున్నారు.
అలాగే, తక్కువ మెజారిటీతోనైనా విజయం లాంఛనమేనన్న అతి విశ్వాసం కూడా కాంగ్రెస్ కొంప ముంచిందంటున్నారు. ఇక, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీసీసీ అగ్రనేతలు విఫలమయ్యారని, కానీ చేసినవి చేయనవి చెప్పుకోవడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందని అంటున్నారు. మరోవైపు రేవంత్ టార్గెట్ గా సీనియర్లు చేసిన రచ్చ కూడా పార్టీకి మైనస్ గా మారిందని, ఓవరాల్ గా గ్రూపు గొడవలే మరోసారి కాంగ్రెస్ ను దెబ్బతీశాయని అంచనాకి వస్తున్నారు. ఇవన్నీ ఇలాగుంటే, టీఆర్ఎస్... ఓటుకి ఐదువేలు పంచిందని, అందుకే కంచుకోటలో కాంగ్రెస్ ఓడిపోవల్సి వచ్చిందని అంటున్నారు. ఏదిఏమైనా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సిట్టింగ్ స్థానాన్నే కోల్పోవడంపై టీకాంగ్రెస్ లో నైరాశ్యం అలుముకుంది.