జగన్ మంత్రుల్లో అప్పుడే మార్పులు...! ఒకర్ని మినహా అందర్నీ మార్చేశారు.!
posted on Oct 25, 2019 @ 11:13AM
కనీసం మూడ్నెళ్లు కూడా తిరక్కుండానే ఏపీలో ఇన్ ఛార్జ్ మంత్రులను మార్చేడం కలకలం రేపుతోంది. నిర్ణయం ఏదైనా అనుకున్న వెంటనే జెట్ స్పీడ్ తో డెసిషన్స్ తీసుకునే సీఎం జగన్మోహన్ రెడ్డి... ఇన్ ఛార్జ్ మంత్రుల విషయంలోనూ అలాగే వ్యవహరించారని అంటున్నారు. ఒక్క మేకపాటి గౌతమ్ రెడ్డి మినహా మిగతా మంత్రులందరినీ మార్చేశారు. ఒక్క చిత్తూరు తప్పా... మిగతా అన్ని జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులను జంబ్లింగ్ చేశారు. జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమించి మూడ్నెళ్లు కూడా తిరక్కుండానే ఎందుకు మార్చేయాల్సి వచ్చిందనేది అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది.
కొందరు మంత్రుల తీరుపై మొదట్నుంచీ అసంతృప్తిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి... వాళ్లపై నిఘా కొనసాగిస్తున్నారట. కొందరికి ఎంత చెబుతున్నా అవినీతి విషయంలో కఠినంగా ఉండటం లేదని, అలాగే కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని నియంత్రించడం లేదని జగన్ అసంతృప్తిగా ఉన్నారట. ఇక, జిల్లాల బాధ్యతల విషయంలోనూ కొందరు మాత్రలు అతిగా వ్యవహరిస్తున్నట్లు జగన్ దృష్టికి వచ్చిందట. జిల్లాలను తమకు రాసిచ్చినట్లుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పెత్తనం చెలాయిస్తున్నారని, అలాగే గ్రూపు రాజకీయాలకు తెరలేపారన్న మాట జగన్ చెవిన పడటంతోనే... ఇన్ ఛార్జ్ మంత్రులను అటూఇటూ మార్చేశారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రుల వ్యవహారశైలిపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న జగన్... కొందరిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించినా ఫలితం లేకపోవడంతోనే మార్పులు జరిగాయని అంటున్నారు.
ఇక కొందరు మంత్రులు అప్పటికప్పుడు తలూపినా, ఆ తర్వాత తమ పని యథావిధిగా కానిచ్చేస్తున్నారట. దాంతో ఆయా మంత్రుల వల్ల భవిష్యత్ పార్టీకి చెడ్డపేరు తప్పదన్న భావనతోనే హెచ్చరికగా జిల్లాల ఇన్ ఛార్జ్ బాధ్యతల్లో భారీ మార్పులు చేశారని చెప్పుకుంటున్నారు. ఇక కొందరైతే ఆయా జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నందుకే మార్చేశారని అంటున్నారు. మరోవైపు నలుగైదురు మంత్రులు జిల్లా ఇన్ ఛార్జ్ బాధ్యతలను భారంగా భావించడంతో నారాయణస్వామి, పుష్ప శ్రీవాణి, పిల్లి సుభాష్, ఆళ్ల నాని, అంజద్ బాషాను రిలీవ్ చేశారని చెబుతున్నారు. ఇక మేకతోటి సుచరితపై ఆరోపణలు రావడంతో ఆమెను జిల్లా ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మూడ్నెళ్లలోనే మంత్రుల బాధ్యతల్లో మార్పులు చేపట్టడం ఏపీలో సంచలనంగా మారింది. అయితే, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రుల మార్పు వెనుక కచ్చితంగా బలమైన రీజనే ఉందన్న మాట వినిపిస్తోంది.