బీజేపీపై వ్యతిరేకతే హస్తానికి కలిసొచ్చిందా? కాంగ్రెస్‌కి అన్ని సీట్లు ఎలా వచ్చాయ్?
posted on Oct 25, 2019 @ 10:53AM
మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనా అందరి చూపూ ఇప్పుడు హస్తం పార్టీ వైపే తిరిగింది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అలాంటి లెక్కలే చెప్పాయి. కనీసం పోటీ కూడా ఇవ్వలేదంటూ తీసిపాడేశాయి. ఇక, సోనియా, రాహుల్ కూడా అలాగే అనుకున్నారో ఏమో తెలియదు గానీ, వాళ్లు కూడా మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గోలేదు. ఎలాగూ ఓడిపోతామ్... అనవసరంగా ఎందుకు కంఠశోష అని భావించారో ఏమో... కానీ, సోనియా, రాహుల్ సైతం ఊహించనివిధంగా మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కు ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి దాదాపు 150 సీట్లు వస్తే... కాంగ్రెస్ మిత్రపక్షాలకు కలిపి 100 సీట్లొచ్చాయి. దాంతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీరియస్ గా పనిచేసుంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చుండేవని అంటున్నారు.
ఇక, హర్యానాలోనైతే ఎవ్వరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు కూడా అందని విధంగా సీట్లు సాధించింది. బీజేపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్టేనని సర్వే సంస్థలన్నీ లెక్కగడితే, ఏకంగా 30కి పైగా స్థానాలను గెలుచుకుని హస్తం పార్టీ సత్తా చాటింది. అయితే, ఖట్టర్ పరిపాలనపై ప్రజల్లో గూడుకట్టుకున్న తీవ్ర వ్యతిరేకతను కాంగ్రెస్ పసిగట్టి ఉంటే ఇక్కడ కూడా ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఊహించనిదానికంటే మంచి ఫలితాలు వచ్చాయి. అయితే, సోనియా, రాహుల్ లు ప్రచారానికి రానుందుకే మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కి కొంతలో కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఒకవేళ వాళ్లు వచ్చుంటే మాత్రం ఇన్ని సీట్లు వచ్చేవే కాదని సెటైర్లు పేలుతున్నాయి. మరి, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలను సోనియా, రాహుల్ లు పట్టించుకోకపోవడం పార్టీకి మైనస్ అయ్యిందో ప్లస్ అయ్యిందో తెలియదు కానీ, జాతీయ నాయకులు కష్టపడి ఉంటే... మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ తరహాలో రిజల్ట్స్ వచ్చేవన్న చర్చ జరుగుతోంది.