జగనన్న ఆటం బాంబ్.. దీపావళి స్పెషల్ ఐటమ్...
posted on Oct 28, 2021 @ 11:42AM
సీఎం జగన్‌రెడ్డి. పాలన పక్కన పడేసి.. ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకున్న ఫైర్ బ్రాండ్. ఆయన టార్గెట్ అంతా ఒక్కటే.. ఏపీని అభివృద్ధి పరచడం కాదు.. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకురావడం అంతకన్నా కాదు. అమరావతిని నాశనం చేయడం.. చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా పరిపాలిస్తున్నారని అంటారు. దూకుడు ముఖ్యమంత్రికి.. బూతులు మాట్లాడే మంత్రులు, దౌర్జన్యాలు చేసే ఎమ్మెల్యేలు, గ్రామాల్లో అరాచకాలకు పాల్పడే పార్టీ శ్రేణులు.. ఇలా మందీమార్బలమూ ఎక్కువే అంటుంటారు. చంద్రబాబుపై, కమ్మ కులంపై అదే పనిగా మాటల బాంబులు పేల్చే జగన్‌రెడ్డికి సింబాలిక్‌గా ఈ దీపావళికి జగన్ బాంబులు రెడీ చేశారు కొందరు. జగన్ ఆటంబాంబ్ పేరుతో ఈ దివాళీకి స్పెషల్ బాంబ్ తీసుకొచ్చారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో పలు క్రాకర్స్ దుకాణాలలో జగన్ ఆటంబాంబ్ స్టిక్కర్‌తో ఉన్న దీపావళి క్రాకర్స్‌ను పెద్ద ఎత్తున అమ్ముతున్నారు. బాగా బతకనేర్చిన వ్యాపారులు ఇలా జగన్ ఫోటోతో బాంబులు తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు. బాంబులపై పెట్టిన జగన్ ఫోటో కూడా సూటబుల్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. వేలు చూపిస్తూ.. కోపంగా ఉన్న జగన్ ఫోటోను బాంబులకు పెట్టారు. దీపావళికి టపాసులు కొందామని వచ్చే కస్టమర్లు.. సీఎం జగన్‌రెడ్డి ఫోటో కమ్ పేరుతో ఉన్న బాంబులు చూసి షాక్ అవుతున్నారు.
సీఎం ఫోటోతో బాంబులు తయారు చేయడం కరెక్టేనా? ఆ బాంబులు పేలిస్తే.. జగన్ ఫోటో ఉంది కాబట్టి ఆయన్ను పేల్చినట్టేనా? రావణాసురిడి బొమ్మను బాంబులతో పేల్చినట్టు ఇది ఉందంటూ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ జగన్ ఆటంబాంబ్ పేలుతుందా? తుస్సు మంటుందా? అంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి. పనిలో పనిగా, నాటు బాంబులకు ఫేమస్ అయిన కడప జిల్లా నుంచి వచ్చిన సీఎం.. జగనన్న బాంబుల పథకం పేరుతో ప్రజలందరికీ ఈ బాంబులు ఫ్రీగా ఇచ్చేస్తే.. జగన్ బాంబులను కాల్చుకొని పండగ చేసుకుంటాంగా అని కూడా అంటున్నారు. ఏదిఏమైనా ఈ దీపావళి స్పెషల్ ఐటమ్.. జగనన్న ఆటంబాంబ్.