Read more!

మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా?

ప్రస్తుత సమాజంలో చదివింది ఒకటయితే చేసే ఉద్యోగం మరొకటి అవుతుంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా వుంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అవసరాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు చదివిన చదువుకు సంబంధించినది కాకుండా పరిచయం లేని, దాని గురించి ఏమీ తెలియని ఉద్యోగం చేయాల్సి రావచ్చు. 

చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవటం వల్ల మనలో నిరాశ, అసంతృప్తి అనేవి చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న యువతలో చాలా బాగా గమనించవచ్చు. దానివల్ల  మానసిక ప్రశాంతత అనేది కరువైపోతుంది. ఈ మానసిక ప్రశాంతత లేని కారణంగానే  ఇబ్బందులకు గురి అవుతున్నాము. మానవ జీవితాలలో అత్యంత ప్రాముఖ్యత వహించే అంశం ఉద్యోగం, మనకు అనుకూలమైన ఉద్యోగం దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి చెందుతూనే మనకు అనుకూలమైన ఉద్యోగం దొరికేంత వరకు దాని కోసం కృషి చేయాలి, దానిని సాధించుకోవాలి. అంతే తప్ప మనకు తగినది దొరకలేదనే కారణంతో ఏదీ చేయకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉండటం వివేకవంతుల లక్షణం కాదు. 

దీనికంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని మనం మానసికంగా ఫీల్ అవ్వాలి అటువంటి మంచి ఉద్యోగం పొందే సామర్థ్యాన్ని, అంటే అర్హతలు మనకున్నాయో లేదో గమనించుకుని ఆ అర్హతలు సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చెయ్యాలి. అలాగని చెప్పి, ఉన్న ఉద్యోగం వదులుకుని, నిరుద్యోగిగా ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. చేస్తున్న ఉద్యోగం మంచి క్రమశిక్షణతో అంకిత భావంతో చేస్తూనే మన సమర్ధతకు సరిపోయే ఉద్యోగం కోసం కృషి చేయాలి. కృషి చేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు లేక, దొరికిన ఉద్యోగాలు చేయలేక ఆత్మనూన్యతాభావంతో ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాని అది సమంజసం కాదు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే అసమర్ధుడిగా ముద్రపడే ప్రమాదం ఉంది. అందుకే దొరికిన ఉద్యోగం చేసుకుంటూ మనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి.

నిజానికి పరిచయం లేని పని దొరికినా ఆ కొత్త పనిలో విషయాన్ని, ఆ పనికి సంబంధించిన మెలకువలను ఆసక్తిగా తెలుసుకునేవాడు ప్రతిభావంతుడు అవుతాడు. ఎదురయ్యే ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడమే వివేకవంతుల విజయాల వెనుక కారణం.

ప్రస్తుతం సమాజంలో వ్యక్తి నైపుణ్యానికి తెలివికి విలువలేని కాలంలో తనకు గుర్తింపు లేదనో, తన తెలివికి తగ్గ ఉద్యోగం లేదనో బాధపడుతూ అశాంతికి గురి అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలివిని మన నైపుణ్యాన్ని గుర్తించే రోజు ఒకటంటూ వుంటుందని గ్రహించాలి, విశ్వసించాలి. పరిస్థితులను అర్ధం చేసుకుని జీవించాలి. మనం వున్న పరిస్థితులలో మౌనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూనే నిత్య జీవితంలో తమ ప్రతిభను వెల్లడించాలి, మనం కొంతమందిని చూస్తూ వుంటాము. వారు ఎదుటివారి దోషాలు చూపటం వల్ల తాను గొప్పవాడైనట్టు భావిస్తుంటారు. తప్ప, తమలోనూ లోపాలున్నాయని అనుకోరు.

ఎదుటివారిలో తప్పులు వెతకడం మాని, తనలోని లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే వ్యక్తికి ఉన్నత అవకాశాలు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.

                                      ◆నిశ్శబ్ద.