Read more!

యూత్ మంత్రం!! సక్సెస్ మంత్రం!! 

 

ఈ ప్రపంచంలో మనిషి బతకడానికి డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే ఏదో ఒక ఉపాధి ఉండాలి. ఉపాదులు బోలెడు ఉన్నా దాన్ని చేరుకునే దారి కనబడాలి. నేటి సమాజంలో నిరుద్యోగం బోలెడు ఉంది. అదంతా మనుషులకు సరైన దారి కనిపించక పోవడం వల్ల ఎదురవుతున్న సమస్యనే. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆదాయ మార్గం కనబడితే, అందులో తృప్తి కూడా దొరికితే అప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో కూడా నిరుద్యోగ సమస్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.  చాలామంది అనుకుంటారు చేస్తున్న పనిలో తృప్తి దొరకడం లేదు అని కానీ బయట సమాజంలోకి  తొంగిచూస్తే పనులు దొరకక సతమయ్యేవాళ్ళు ఎందరో కనబడతారు. అందుకే ఉన్న అవకాశాన్ని వినియోగించుకుంటూ మరొకరికి కూడా బోలెడు దారులు చూపించవచ్చు. నేటి యువతలో చాలామంది ఇలాంటి ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారు. 

అభిరుచి ఆదాయం!!

అభిరుచి ఆదాయం రెండూ సమర్థవంతంగా ఉన్న పనులు చేస్తున్నవాళ్ళు బహుశా తక్కువే ఉండవచ్చు. అయితే అభిరుచి కొద్దీ కొన్ని అవకాశాలు వదిలి కొత్తగా ప్రయోగాలు చేసి బోలెడు మందికి ఉపాధి కల్పిస్తున్న  నేటి యువత గురించి చెప్పుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా ఛాలెంజ్ లు తీసుకుంటూ సాగే మార్గాలను నేటి యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాంటి వాటిలో విజయాలు సాధించి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఐకాన్ లుగా మారుతున్నారు.

కష్టం, ప్రోత్సాహం!!

ఒక రూపాయిని కష్టపడి సంపాదిస్తేనే ఆ రూపాయిని వృధా చేయకుండా ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయం అర్థమవుతుంది. ఆ కష్టం తాలూకూ విలువ ఆ రూపాయిలో ప్రస్ఫుటం అవుతుంది. ఈ విషయం బాగా తెలిసినవాళ్లకు చాలా చోట్ల ప్రోత్సాహం కూడా లభిస్తుంది. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాడు ఏ పని పట్ల అయినా బాధ్యతగా ఉండగలుగుతాడు. ఇచ్చిన పనిని సమర్థవంతంగా చేయగలుగుతాడు. కాబట్టి కష్టం తెలిసిన వాడికి ఏదో ఒక సాండ్స్ర్భంలో ప్రోత్సాహం కూడా లభిస్తుంది కచ్చితంగా.

విభిన్నత, ఆత్మవిశ్వాసం!!

విభిన్నంగా ఏవైనా ఆలోచిస్తే హేళన చేసేవాళ్ళు బోలెడు కనబడతారు చుట్టూ. అయితే ఆ విభిన్నతను  అంతే విభిన్నంగా ప్రెజెంట్ చేస్తే మాత్రం ఫిదా అవ్వని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా ఈకాలంలో యువత అయితే విభిన్నంగా ఆలోచిస్తున్నా ప్రోత్సాహం లేకపోవడంతో తమలాంటి ఆలోచన ఉన్నవాళ్ల కోసం వెతికి వాళ్ళతో ఒక సమూహం ఏర్పడి తాము అనుకున్న పనిని అందరూ కలసి ఒక్కటిగా తమ అభిప్రాయాలు, ఆలోచనా  విధానాలు పంచుకుంటూ తాము అనుకున్నది చేది చూపిస్తున్నారు. ఈ విషయంలో వాళ్లకు తమ పట్ల తమ ఆలోచనల పట్ల నమ్మకం ఉండటమే ప్రధానం విజయ సూత్రం. అందుకే ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి పనిని అయినా తప్పకుండా చేసి చూపించగలదు నేటి యువత.

విద్య, ఉపాధి!!

నిజం చెప్పాలంటే విద్యార్హతకు తగ్గ ఉపాధి వెతుక్కోవడం నేటి కాలంలో పరిపాటి. కానీ విద్యకు ఉపాధికి సంబంధమే లేదని ఎందరో విజయాలు సాధించి చెబుతూనే ఉన్నారు. తమలో ఉన్న ప్రత్యేకతని మెరుగుదిద్దుకుని దాన్నే ఉపాధిగా మార్చుకుంటున్న వాళ్ళు ఎప్పటికీ విఫలం కావడం అనేది ఉండనే ఉండదు. కానీ మూర్ఖులు మాత్రం ఎంత చదివారు అనేది చూస్తారు కానీ ఎంత నైపుణ్యత ఉంది అనేది గమనించుకోరు. ఈ విషయంలో యువత తమని తాము నమ్మడం మాత్రమే మొదటి విజయం అనుకోవచ్చు. 

పై విషయాలు అన్నీ చూస్తే ప్రభుత్వాలు, వాళ్ళు విడుదల చేసే నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీలు. రిజర్వేషన్లు ఇతలాంటి తలనొప్పులు ఏమీ లేకుండా హాయిగా తమ జీవితాన్ని తమ చేతుల్లోనే డీల్ చేసుకోగలిగే ఆలోచన నేటి యువతలో మరింత పెంపొందాలి. అప్పుడే సక్సెస్ మంత్రం వాళ్ళ చేతుల్లో పట్టుబడుతుంది.

◆ వెంకటేష్ పువ్వాడ