Read more!

అలారంతో నిద్రలేచే అలవాటుందా? అయితే వెంటనే మానేయడం మంచిది!

ఉదయాన్నే లేచి ఇంటిపనులు చేసుకోవడం కోసం కొందరు మహిళలు, ఉదయాన్నే లేచి జిమ్ కో,  వాకింగ్ కో వెళ్లాలని కొందరు, చదువుకోవాలని కొందరు ఇలా ఎంతోమంది ఉదయం సమయంలో తొందరగా నిద్ర లేవడానికి అలారం సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇలా అలారం సహాయంతో నిద్రలేస్తామని, పనులన్నీ చక్కగా చేసుకుంటామని, చక్కగా చదువుకుంటామని గొప్పగా చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇలా అలారం సహాయంతో నిద్రలేవడం అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదనే చేదు వార్త ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న అంశం. అసలు అలారం సహాయంతో నిద్రలేవడం ఎందుకు మంచిది కాదు? దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటి?  ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే ఇకమీదట ఎప్పుడూ అలారం పెట్టుకుని నిద్రలేవడానికి ప్రయత్నించరు.

ఒకప్పుడు పిల్లలు పరీక్ష సమయాల్లో ఉదయమే లేచి చదువుకోవాలంటే అలారం ఉపయోగించేవారు. ఆ తరువాత మొబైల్ లోనే అలారం అందుబాటులోకి వచ్చాక నిద్రపోయే ముందు పక్కనే పెట్టుకుని పడుకునే మొబైల్ అలారం సహాయంతో నిద్రలేస్తుంటారు. కానీ చాలామంది అలారం మోత  మోగగానే మొదట్లోనే లేవరు. అది ఒకటికి పదిసార్లు మోగితే కానీ నిద్రలేవరు.  అసలు సమస్య ఎక్కడుందంటే.. ఉదయాన్నే నిద్రలేవడానికి ఉపయోగింటే అలారం సౌండ్ ఆరోగ్యం మొత్తాన్ని చెడగొట్టేస్తుంది. రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరం ఉదయాన్నే పెద్ద శబ్దాలతో మేల్కొనడం అంటే అది రక్తపోటు, గుండె సమస్యలకు కోరి దారి ఇస్తున్నట్టేనట.  రాత్రంతా నిశ్చల స్థితిలో పడుకుని ఉండటం వల్ల శరీరంలో రక్తం చిక్కగా ఉంటుంది. అలారం శబ్దం కారణంగా మేల్కోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ చురుగ్గా జరగదు. శరీరం సాధారణంగా మేల్కొన్నప్పుడు శరీరంలో రక్తం చురుగ్గా ప్రసారమవుతుంది. నిద్రమత్తులో, గాఢంగా ఉన్నప్పుడు  అలారం శబ్ధం ద్వారా మేల్కోవడం అంటే జ్ఞాపకశక్తి, మెదడు సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. అలారం ద్వారా మేల్కోవడం అడ్రినలిన్ పై ప్రభావం చూపిస్తుంది.  కాబట్టి అలారం ద్వారా నిద్ర నుండి మేల్కొనే అలవాటు ఉన్నవారు దీన్ని మానేయడం ఉత్తమం.

అలారం అలవాటు ఎలా మానాలంటే..

అలారం ద్వారా లేవడం రోజులో భాగమైపోయినవారు దీన్ని మానుకుని సాధారణంగా నిద్రలేవడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఈ అలవాటు మానడం వల్ల దీర్ఘకాల అనారోగ్యాలు నివారించవచ్చు.

అలారం వరుసపెట్టి అరుస్తున్నా నిద్రమత్తుతో లేవకుండా బద్దకంగా అలాగే పడుకునే అలవాటు మానుకోవాలి. ఒకటి లేదా రెండు సార్లు అలారం మోగగానే దాన్ని కట్టేయాలి. ఇది క్రమంగా సాధారణంగా లేచే సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

బిగ్గరగా భయపెట్టేలానూ, పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన అలారం ను ఉపయోగించడం మానుకోవాలి. సన్న శబ్దంతో పేస్ ఫుల్ గా ఉండే అలారం వాడితే ప్రభావం తక్కువగా ఉంటుంది.

ఇంట్లో సూర్యకాంతి నేరుగా ముఖం మీద పడేలాగా నిద్రపోయే ప్రాంతాన్ని సెట్ చేసుకోవాలి. దీనివల్ల ఏ అలారం అక్కర్లేకుండా నిద్రలేవవచ్చు.

ప్రతిరోజూ ఒకేసమయంలో నిద్రపోవడం, నిద్రలేవడం చేస్తుంటే ఉదయం సమయంలో అలారం అక్కర్లేకుండానే దానికదే మెలకువ వస్తుంది.

ప్రతి రోజూ 7నుండి 8గంటలపాటు నిద్రపోవాలి. ఆరోగ్యకరమైన నిద్ర ఉన్నప్పుడు మేల్కోవడం కూడా సులువుగానే జరుగుతుంది. అదే నిద్ర తక్కువైతే మేల్కోవడం కష్టం.

                              *నిశ్శబ్ద.